Begin typing your search above and press return to search.

ఊహించిన సినిమాకు అవార్డు రాలేదేంటి ?

By:  Tupaki Desk   |   12 Aug 2019 4:08 AM GMT
ఊహించిన సినిమాకు అవార్డు రాలేదేంటి ?
X
గతేడాది కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకులను సప్రయిజ్ చేసి మంచి విజయం సాధించాయి. అందులో ప్రశంసలు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ లిస్టులో మొదటి స్థానంలో ఉంటుంది 'కేరాఫ్ కాంచరపాలెం'. విశాఖపట్నం దగ్గర కాంచరపాలెం అనే ప్రాంతంలో అక్కడి వ్యక్తులతోనే వెంకటేష్ మహా తీసిన ఈ సినిమా అటు సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది.

అయితే విడుదలకు ముందే అందరిచే మన్ననలు అందుకున్న ఈ సినిమాకి కచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని అందరూ ఊహించారు. రిలీజ్ కి ముందే ఇది అవార్డ్ సినిమా అని చూసిన అందరూ చెప్పుకున్నారు. తీరా మొన్న అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్స్ లిస్టులో ఈ సినిమా పేరు ఏ శాఖలోనూ లేకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. నిజానికి కాంచరపాలెంకి స్క్రీన్ ప్లే లో అవార్డు వస్తుందనుకున్నారు. కానీ చిలసౌకి ఇచ్చారు. రాహుల్ రవీంద్రన్ తీసిన ఈ సినిమా కూడా స్క్రీన్ పరంగా అందరినీ ఆకట్టుకుంది. ఆ రకంగా గతేడాది వచ్చిన మన తెలుగు సినిమాల్లో 'చిలసౌ' కి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ గౌరవం దక్కింది.

ఒక వైపు రామ్ చరణ్ పోషించిన చిట్టి బాబు క్యారెక్టర్ కి కూడా నేషనల్ అవార్డు వస్తుందనుకున్నారు. కానీ రంగస్థలంలో కేవలం సౌండ్ మిక్సింగ్ కి మాత్రమే అవార్డు దక్కింది. దీంతో మెగా అభిమానులు నేషనల్ అవార్డ్స్ ని లైట్ తీసుకున్నారు. చరణ్ చిట్టిబాబుగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడని అవే అవార్డుతో సమానమని సరిపెట్టుకుంటున్నారు. ఏదేమైనా ఈసారి మన తెలుగు పరిశ్రమకు నేషనల్ అవార్డ్స్ రూపంలో మంచి గౌరవమే లభించింది.