Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'కేరాఫ్ కంచరపాలెం'

By:  Tupaki Desk   |   7 Sep 2018 12:31 PM GMT
మూవీ రివ్యూ: కేరాఫ్ కంచరపాలెం
X
చిత్రం: ‘కేరాఫ్ కంచరపాలెం’

నటీనటులు: సుబ్బారావు - రాధ బెస్సీ - కేశవ కర్రి - నిత్య శ్రీ గోరు - కార్తీక్ రత్నం - పరుచూరి విజయ ప్రవీణ - మోహన్ భగత్ - ప్రణీత పట్నాయక్
సంగీతం: స్వీకర్ అగస్తి
ఛాయాగ్రహణం: వరుణ్ షాఫేకర్
నిర్మాత: పరుచూరి విజయ ప్రవీణ
రచన - దర్శకత్వం: వెంకటేష్ మహా

కేరాఫ్ కంచరపాలెం.. కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన చిత్రం. వెంకటేష్ మహా అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా చూసి సినీ ప్రముఖులు వేనోళ్ల పొగిడారు. దీని ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘కేరాఫ్ కంచరపాలెం’. మరి ఈ అంచనాల్ని ఆ చిత్రం ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

50 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాని ఒక అటెండర్.. అతను ఇష్టపడే ఒక పై అధికారి.. ఓ పదేళ్ల పిల్లాడు.. అతణ్ని ఆకర్షించే ఓ అమ్మాయి.. మద్యం దుకాణంలో పని చేసే ఓ కుర్రాడు.. అతను ప్రేమించే ఒక వేశ్య.. ఓ క్రిస్టియన్ కుర్రాడు.. అతడిని ఇష్టపడే ఓ బ్రాహ్మణ అమ్మాయి.. కంచరపాలెం అనే ఊళ్లో ఉండే వీళ్లందరి మధ్య సాగే కథే ‘కేరాఫ్ కంచరపాలెం’. వీరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వాటి వల్ల వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

సినిమాలు వస్తుంటాయి. వెళ్తుంటాయి. కానీ చూశాక కొన్ని రోజుల పాటు వెంటాడే.. మనసులో నిలిచిపోయే సినిమాలు మాత్రం అరుదుగానే వస్తుంటాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఆ కోవలోని చిత్రమే. ఈ చిత్రాన్ని విడుదల చేసిన సురేష్ బాబు అన్నట్లుగా ఇదొక నిజాయితీతో కూడిన ప్రయత్నం. స్వచ్ఛమైన సినిమా అనే మాటకు ఇది సరైన ఉదాహరణ. మన చుట్టూ ఉన్న మనుషుల్నే తెరమీద చూస్తున్నట్లు.. వాళ్ల జీవితాల్ని పక్కనుండి గమనిస్తున్నట్లు.. వాళ్లతో కలిసి మనం కూడా సాగుతున్నట్లు అనిపిస్తుంది ‘కేరాఫ్ కంచరపాలెం’ చూస్తుంటే. కాబట్టే తెరపై పాత్రలు బాధపడుతుంటే మనమూ బాధపడతాం. అవి తమషా చేస్తే నవ్వుకుంటాం. ఆ పాత్రల తాలూకు ఉత్కంఠను అనుభవిస్తాం. అన్ని రకాల భావోద్వేగాలనూ ఫీలవుతాం. ఇలా పాత్రలతో పాటుగా ప్రయాణించడం అన్ని సినిమాల్లోనూ జరగదు. కాబట్టే ‘కేరాఫ్ కంచరపాలెం’ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది.

చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి పాత్రలోనూ జీవం ఉండటం.. ప్రేక్షకులు ఈజీగా రిలేట్ చేసుకోవడం ‘కేరాఫ్ కంచరపాలెం’లోని అతి పెద్ద విశేషం. ఆయా పాత్రల తాలూకు అర్థవంతమైన కథలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రధానంగా నాలుగు ఉపకథలు చూపించారు. ఇలాంటి సందర్భాల్లో ఒకట్రెండు కథలు.. కొన్ని పాత్రల వరకు బాగుంటాయి. ప్రత్యేకత చాటుకుంటాయి. మిగతా వాటిని తేల్చేస్తుంటారు. కానీ ‘కేరాఫ్ కంచరపాలెం’లో అలా జరగలేదు. ఇందులో ఏ కథకు ఆ కథ ప్రత్యేకంగా అనిపిస్తుంది. పాత్రలన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇద్దరు నడివయస్కుల ప్రేమకథను ఎంతో పరిణతితో డీల్ చేసిన విధానం మెప్పిస్తుంది. 50 ఏళ్ల వయససొస్తున్నా పెళ్లికాని రాజు పాత్రను మలిచిన విధానం అలరిస్తుంది. సినిమాలో ఈ పాత్ర ద్వారా పండించిన వినోదం హైలైట్ గా నిలుస్తుంది. ఈ పాత్ర స్థాయిలో మిగతా వినోదాత్మకంగా ఉండవు కానీ.. మిగతా పాత్రలు.. వాటి కథలు కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి. పాత్రలతో ఈజీగా కనెక్టవడం వల్ల సినిమాలో త్వరగా ఇన్వాల్వ్ అయిపోతాం. వాళ్ల జీవితాల్లో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠకు లోనవుతాం.

సినిమాలో ప్రతి పాత్రకూ ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్ల ప్రవర్తన.. మాటల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి పాత్రకు ఒక బ్యాక్ స్టోరీ రాసి... దానికి తగ్గట్లే ఆయా పాత్రలు ప్రవర్తించేలా దర్శకుడు శ్రద్ధ వహిస్తే.. నటీనటులు కూడా ఆ పాత్రల్ని ఆకళింపు చేసుకుని నటిస్తే.. తెరమీద నటుల్ని కాకుండా నిజంగా వ్యక్తుల్నే చూస్తున్న భావన కలుగుతుందనడానికి ‘కంచరపాలెం’లో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. నిజంగా కంచరపాలెం అనే ఊళ్లో.. అక్కడి వ్యక్తుల్నే నటులుగా పెట్టి సినిమా తీయడం వల్ల దీనికి మరింత సహజత్వం వచ్చింది.ఇందులోని పాత్రలు.. దీని నడత అదీ చూస్తే ఇదో ఆర్ట్ సినిమాలా కనిపిస్తుంది కానీ.. లవ్.. కామెడీ.. యాక్షన్.. థ్రిల్.. ఇలా ఒక ‘కమర్షియల్’ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయిందులో. కుల వ్యవస్థ.. పరువు హత్యలు వంటి అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగింది ఇందులో. .. పదేళ్ల పిల్లాడితో పాటు 50 ఏళ్ల మధ్య వయస్కుడి ప్రేమకథను కూడా చూపించడం ద్వారా ప్రేమకు వయసుతో సంబంధం లేదని.. మనిషి జీవితంలో ప్రేమ అనేది అతి ముఖ్యమైన అంశమని దర్శకుడు చాటిచెప్పాడు. ప్రతి ప్రేమకథలోనూ ‘ఆర్ట్’ అన్నది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ రకంగా దర్శకుడు తన అభిరుచిని చాటుకున్నాడు.

అందరూ కొత్త వాళ్లు నటించడం ఆరంభంలో అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. మొదట్లో సన్నివేశాలు కూడా కొంచెం నెమ్మదిగా సాగుతాయి. కానీ పాత్రలతో కనెక్షన్ ఏర్పడ్డాక సినిమా ఇక ఆగదు. చివరి వరకు అలా కూర్చోబెట్టేస్తుంది. ప్రథమార్ధం చాలా వరకు వినోదాత్మకంగా సాగిపోతుంది. ద్వితీయార్ధం ఎమోషనల్ గా నడుస్తుంది. సినిమాలో ఎన్నదగ్గ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ బలమైన ముద్ర వేస్తుంది. ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన అనుభూతితో థియేటర్ల నుంచి బయటికి వస్తారు. కళాత్మక సినిమాలంటే ప్రేక్షకులు చూడ్డానికి అర్హం కానిదన్న ఒక అభిప్రాయం బలపడిపోయింది. ఐతే ‘కేరాఫ్ కంచరపాలెం’ కళాత్మకంగా సాగుతూనే.. వినోదం పంచడం.. సగటు ప్రేక్షకులకు నచ్చేలా ఉండటం విశేషం. కమర్షియల్ గా ఏ స్థాయి విజయాన్నందుకుంటుందన్నది పక్కన పెడితే... కొన్నేళ్లుగా సరికొత్తగా సాగిపోతున్న తెలుగు సినిమా ప్రస్థానంలో ఇదొక మంచి మలుపు అనడంలో సందేహం లేదు.

నటీనటులు:

‘కేరాఫ్ కంచరపాలెం’లో ఏ ఒక్కరి గురించో ప్రత్యేకంగా చెప్పి ఆపేయలేం. కంచరపాలెం ఊరికి చెందిన వాళ్లే ఇందులో నటించారు. నిజానికి వాళ్లెవ్వరూ నటించినట్లుగా అనిపించదు. అంత సహజంగా తమ పాత్రల్ని పండించారు. అందరిలోకి రాజు పాత్ర చేసిన వ్యక్తి నటన హైలైట్ గా నిలుస్తుంది. చిన్న పిల్లలు సైతం అబ్బుర పరిచే నటనతో కట్టి పడేశారు. నిర్మాత విజయ ప్రవీణ వేశ్య పాత్రలో గొప్పగా నటించింది. తక్కువ నిడివి ఉన్న చిన్న చిన్న పాత్రల్లో నటించిన వాళ్లు సైతం తమదైన ముద్ర వేశారు.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గానూ ‘కేరాఫ్ కంచరపాలెం’ ఉన్నతంగా అనిపిస్తుంది. సాంకేతిక నిపుణులందరూ దర్శకుడి ఆలోచనలకు.. అభిరుచికి తగ్గట్లుగా పని చేశారు. స్వీకర్ అగస్తి పాటలు.. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లే చాలా స్వచ్ఛంగా అనిపిస్తాయి. సింక్ సౌండ్ లో చేయడం వల్ల సినిమాకు వైవిధ్యం చేకూరింది. వరుణ్ షాఫేకర్ ఛాయాగ్రహణం కూడా సినిమాకు బలంగా నిలిచింది. దర్శకుడు.. కెమెరామన్ కలిసి కంచరపాలెం నేటివిటీని చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. నిర్మాత విజయ ప్రవీణ అభిరుచికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ చిత్రానికి అండగా నిలిచిన రానా దగ్గుబాటిని కూడా అభినందించాలి. ఇక దర్శకుడు వెంకటేష్ మహా తొలి సినిమాతోనే బలమైన ముద్ర వేశాడు. రచయితగా.. దర్శకుడిగా అతడి ప్రతిభ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. అతను పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే.. నరేషన్ చాలా కొత్తగా అనిపిస్తాయి. ఒక కొత్త దర్శకుడు ఇలాంటి సాహసం చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.

చివరగా: స్వచ్ఛమైన సినిమా.. కేరాఫ్ కంచరపాలెం

రేటింగ్-3.25


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre