Begin typing your search above and press return to search.

సినిమాల‌కేనా.. క‌రోనా పంచ్ బార్ల‌పైనా!

By:  Tupaki Desk   |   8 March 2020 11:14 AM GMT
సినిమాల‌కేనా.. క‌రోనా పంచ్ బార్ల‌పైనా!
X
కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్ర‌దేశ్ లో మ‌ద్యం ధ‌ర‌లు అమాంతం రెట్టింపు అయిన సంగ‌తి తెలిసిందే. రెండు బీర్లు తాగి బార్ బ‌య‌టికొస్తే రూ.500 నోట్ ఖాళీ. ఫ్రెండ్సుతో గ‌ట్టిగా పార్టీలు చేసుకుంటే రూ.5000-10,000 మ‌ధ్య హాంఫ‌ట్ అయిపోతోంది. ఈ దెబ్బ‌కు బార్లు.. బీర్లు.. వైన్ పార్టీ అంటేనే బెంబేలెత్తిపోతోంది యూత్. అలాంటిది బార్ వినోదం లేక‌పోయినా కనీసం థియేట‌ర్ వినోదానికి వెళ‌దామ‌న్నా.. ఇప్పుడు క‌రోనా పోటు మామూలుగా లేదు. ఎటు చూసినా క‌రోనా గోల‌. ఇప్ప‌టికే భార‌త‌దేశంలో మొత్తం 39 మంది క‌రోనా సోకిన బాధితులు ఉన్నారంటూ అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. వీరి నుంచి ఈ క‌రోనా భూతం ఎటు పాకిపోతుందోనన్న ఆందోళ‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఆ క్ర‌మంలోనే సినిమా హాళ్లు.. బార్లు.. అలాగే హాస్పిట‌ళ్ల‌కు వెళ్లాల‌న్నా భ‌యంతో బిక్కు బిక్కుమంటున్నారు. జ‌నం తండోప‌తండాలుగా తిరిగే చోట అనుమానంగా చూస్తున్నారంతా. ఈ ప్ర‌భావం అటు సినిమా టిక్కెట్ల‌పైనా ప‌డింది. ఇప్ప‌టికే థియేట‌ర్లు 30 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకుండా అల్లాడి పోతున్నాయి. ఓవైపు క‌రోనా దెబ్బ‌కు ప‌రీక్ష‌ల దెబ్బ అంతే ఇబ్బందిక‌రంగా మారింద‌ని థియేట‌ర్ యాజ‌మాన్యాలు వాపోతున్నాయి. మొన్న‌టికి మొన్న రిలీజైన సినిమాల‌న్నీ క‌లెక్ష‌న్లు లేక లబోదిబోమ‌నే ప‌రిస్థితి ఉంది. ఇక వీటిని ఆన్ లైన్ టిక్కెట్లు కొని చూసేవాళ్లు లేక‌పోయార‌ట‌. ఇక ఏసీ థియేట‌ర్ల‌పై ఈ దెబ్బ మ‌రీ పెద్ద‌గానే ఉంద‌ట‌. ఏసీలో చ‌ల్ల‌ని గాలిలో క‌రోనా సులువుగా ప‌క్క‌వాళ్ల‌కు పాకేస్తుంది. అందువ‌ల్ల ఎండాకాలం అయినా ఏసీ థియేట‌ర్ల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని జ‌నం నిర్ణ‌యించుకున్న‌ట్టే క‌నిపిస్తోంద‌ట‌. ఓవైపు మ‌ల్టీప్లెక్సులు.. థియేట‌ర్ల వ‌ద్ద ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించిన ఆరోగ్య‌సూత్రాల్ని అమ‌ల్లోకి తెచ్చినా అవేవీ జ‌నం ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ఈ సీజ‌న్ లో థియేట‌ర్ బిజినెస్ ల‌కు భారీగా పంచ్ ప‌డిపోయిన‌ట్టేన‌ని విశ్లేషిస్తున్నారు.

ఓవైపు క‌రోనా లేదు లేదు అంటూనే ప‌దుల సంఖ్య‌లో జ‌నాల‌ను ఐసోలేష‌న్ వార్డుల్లో ఉంచి చికిత్స చేయిస్తున్నామ‌ని ప్ర‌క‌టిస్తుండ‌డంతో ఒక‌టే గంద‌ర‌గోళం నెల‌కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో లేదు లేదు అంటూనే దుబాయ్ నుంచి అబూద‌బీ.. ఇత‌ర ఫారిన్ దేశాల నుంచి వ‌చ్చిన వాళ్ల‌ను ఆస్ప‌త్రుల‌కు పంపుతుంటే గుండె ఝ‌ల్లుమంటోంది. కార‌ణం ఏదైనా ఈ స‌మ్మ‌ర్ ఇటు సినీప‌రిశ్ర‌మ స‌హా అటు మ‌ద్యం ప‌రిశ్ర‌మ‌ను చావు దెబ్బ కొట్టేస్తుండ‌డంతో అమ్మ‌కం దార్లు అంతా బేల‌గా చూస్తున్నారు. ఇంత‌కుముందు బార్ల ముందు తిరునాళ్ల‌లా ఉండేది. కానీ ఇప్పుడు క‌రోనా దెబ్బ‌కు బార్ల ముందు క్యూ క‌ట్టేవాళ్లు త‌గ్గిపోవ‌డం చూస్తుంటే హ‌త‌విధీ అంటూ చెవులు మూసుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతోంది. ఇక ఇప్ప‌టికే పెరిగిన ధ‌ర‌ల‌తో ఏపీలో అయితే తాగుబోతులంతా నీర‌స‌ప‌డిపోయి చేవ‌చచ్చిపోయార‌న్న చ‌ర్చ కూడా సాగుతోంది.