Begin typing your search above and press return to search.

సుశాంత్ డెత్ మిస్టరీ.. ఆ ఇద్దరిని ప్రశ్నించిన సీబీఐ!

By:  Tupaki Desk   |   23 Aug 2020 4:42 PM GMT
సుశాంత్ డెత్ మిస్టరీ.. ఆ ఇద్దరిని ప్రశ్నించిన సీబీఐ!
X
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే పలు ట్విస్టులు ఈ ఉదంతంలో చోటు చేసుకున్నాయి. ఒక నటుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఇంత భారీగా చర్చ జరగటంతోపాటు.. అటు చలనచిత్రపరిశ్రమతో పాటు.. రాజకీయ నేతలు సైతం ఈ వ్యవహారంపై వ్యాఖ్యలు చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. జరిగింది ఆత్మహత్య అని చెబుతుంటే.. అదేమీ కాదు.. ప్రీప్లాన్ మర్డర్ అంటూ పేర్కొంటున్న వైనం తెలిసిందే.

ఇదిలా ఉంటే సుశాంత్ సూసైడ్ మిస్టరీని తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగటం తెలిసిందే. తాజాగా సీబీఐ అధికారులు సుశాంత్ ఇంటి హౌస్ కీపర్ నీరజ్ సింగ్ ని..ఆయన మాజీ మేనేజర్ సిద్దార్థ్ పితానిలను వారు విచారించారు. వీరిద్దరి వాంగ్మూలాలు ఈ కేసుకు కీలకం కానున్నట్లు చెబుతున్నారు.

హౌస్ కీపర్ నీరజ్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించటం ఇది మూడోసారి. గతంలోనూ రెండుదఫాలుగా విచారించిన అధికారులు.. ఈరోజు మూడోసారి మరింత ఎక్కువసేపు విచారించినట్లుగా చెబుతున్నారు. ఇటీవల తెర మీదకు వచ్చిన అంశాల్ని తమ ప్రశ్నల్లో జొప్పించినట్లుగా చెబుతున్నారు. ఈ ఇద్దరిని విచారించిన అధికారులు ముంబయిలోని సుశాంత్ ఇంటిని మరోసారి సందర్శించి.. పలు వివరాల్ని సేకరించినట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఢిల్లీకి చెందిన నలుగురు ఎయిమ్స్ సభ్యుల ఫోరెన్సిక్ టీం ఒకట్రెండురోజుల్లో ముంబయికి రానున్నట్లుగా చెబుతున్నారు. ముంబయిలో వారు సుశాంత్ ఆటాప్సీ రిపోర్టును పరిశీలించనున్నారు. ఓవైపు సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యపై సోషల్ మీడియాలోనూ.. బాలీవుడ్ చిత్రపరిశ్రమతో పాటు..రాజకీయ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చలు.. వాదోపవాదాలు సాగుతున్నాయి.