Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ భార్యకు సీసీబీ సమన్లు...!

By:  Tupaki Desk   |   16 Oct 2020 2:00 PM GMT
డ్రగ్స్ కేసు: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ భార్యకు సీసీబీ సమన్లు...!
X
కన్నడ చిత్రసీమలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం కేసులో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ రాకెట్ లింకులు బయటపడిన నేపథ్యంలో హీరోయిన్లు రాగిణి - సంజన గల్రానీ‌ని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ బావ మరిది, కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్‌ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా ఇంట్లో సోదాలు నిర్వహించారు. డ్రగ్‌ వ్యవహారం కేసులోని 12 మంది ప్రధాన నిందితుల్లో ఆదిత్య అల్వా కూడా ఉన్నట్లు సీసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే అప్పటి నుంచి ఆదిత్య ఆల్వా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న ఆదిత్య అల్వా కోసం సీసీబీ పోలీసులు సెర్చ్ వారెంట్‌ జారీ చేశారు. ఆదిత్య తన సోదరి ప్రియాంక(వివేక్ ఒబెరాయ్ భార్య) ఇంట్లో తల దాచుకున్నాడనే అనుమానంతో ముంబైలోని వివేక్ ఇంటిని సెర్చ్ చేసారు.

సీసీబీ అధికారులు గత రెండు రోజులుగా వివేక్ ఒబేరాయ్, ఆయన భార్య ప్రియాంక ఆల్వా ఇంటిలో సోదాలు జరిపారు. అయితే సీసీబీ సోదాలకు ప్రియాంక ఆల్వా సహకరించలేదని అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా ఆమె తన మొబైల్ ఫోన్‌ ఇవ్వడానికి నిరాకరించారనే విషయాన్ని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆమెకు విచారణకు హాజరుకావాలంటూ సీసీబీ సమన్లు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. వివేక్ ఒబేరాయ్ భార్య ప్రియాంక ఆల్వాను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విచారణకు హాజరుకావాల్సిందిగా వాట్సప్ ద్వారా సమన్లు జారీ చేయడం సంచలనంగా మారింది.

కాగా, దివంగత గౌరీ లాంకేష్ సోదరుడు ఇంద్రజిత్ లాంకేష్ ఇచ్చిన సమాచారం మేరకు శాండిల్ వుడ్ మాదక ద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చింది. ఆదిత్య అల్వా ఇంద్రజిత్ లంకేష్‌ తో డ్రగ్స్ వ్యవహారాలు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఆదిత్య అల్వా పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆదిత్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతని ఇంటిపై దాడులు చేశారు. అయితే సెప్టెంబర్ 4 నుంచి ఆదిత్య అల్వా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక మంది ప్రమేయాన్ని గుర్తించిన సీసీబీ అధికారులు.. నటీమణులు రాగిణి - సంజనలతో పాటు ఖన్నా - వ్యాపారవేత్త రాహుల్‌ - నటుడు నియాజ్‌ లను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో సోదాలు చేయడమే కాకుండా ఆయన భార్యకు సమన్లు జారీ చేయడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.