Begin typing your search above and press return to search.

సరోజ్‌ ఖాన్‌ మృతికి సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు...!

By:  Tupaki Desk   |   3 July 2020 2:05 PM GMT
సరోజ్‌ ఖాన్‌ మృతికి సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు...!
X
ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ ఖాన్‌(71) శ్వాసకోశ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న సరోజ్‌ ఖాన్‌ బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌ గా గుర్తింపు పొందారు. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు కొరియోగ్రఫీ అందించి 'మాస్టర్ జీ' అని.. 'మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌' అని ప్రసిద్ధి చెందారు. ఇక తెలుగులో చిరంజీవి నటించిన ''చూడాలని ఉంది'' సినిమాకు కూడా ఆమె కొరియోగ్రాఫర్‌ గా చేశారు. ఈ చిత్రానికిగాను ఆమె 1998లో నంది అవార్డు కూడా అందుకున్నారు. కాగా తన కొరియోగ్రఫీతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సరోజ్ ఖాన్ మరణ వార్త సిని లోకాన్ని శోక సంద్రంలో ముంచింది. సినీ సెలబ్రిటీలు అందరూ ఆమెకి సంతాపం ప్రకటించారు.

మహేష్ బాబు సరోజ్‌ ఖాన్‌ మరణంపై స్పందిస్తూ ''ఏస్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మరణం వార్త కలచి వేసింది... ఆమె టైం లెస్ క్లాసిక్స్ రాబోయే జనరేషన్ కి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఒక శకానికి ముగింపు... ఆమె కుటుంబానికి మరియు ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సరోజ్ ఖాన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అని ట్వీట్ చేసారు. ఇక అల్లు అర్జున్ ''నేను ఆమె పట్ల నా గౌరవాన్ని తెలియజేస్తున్నాను.. ఆమెకు ప్రియమైన వారందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సరోజ్ ఖాన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను'' అని ట్వీట్ చేశారు. దీనికి 'డాడీ' సినిమా కోసం సరోజ్ ఖాన్ కంపోజ్ చేసిన సాంగ్ ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి - బన్నీ కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేసారు.

హీరోయిన్ రకుల్ ప్రీత్ స్పందిస్తూ.. ''2020 దయచేసి ఇంకా చెడు వార్తలు వినేలా చేయకు. సరోజ్ ఖాన్ మరణ వార్త ఎంతో బాధను కలిగిస్తోంది. ఆమెతో ఒక్క పాటకైనా పని చేయాలని ఎల్లప్పుడూ కలలు కనేదాన్ని. మీ గ్రేస్.. సినిమాకు మీరు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం. మీ ఆత్మకు శాంతి కలగాలి'' అని పేర్కొంది. ఇక సరోజ్ ఖాన్ మృతిపై తాప్సీ స్పందిస్తూ.. ''మీ కంపెనీలో పని చేస్తే చాన్స్ వస్తే.. ఆ మెమోరీస్‌ ను కచ్చితంగా బంధించుకునేదాన్ని, మరో స్టార్ ని మనం కోల్పోయాం. ప్రతీ ఒక్క అమ్మాయి మీ పాటల ద్వారా జీవితాంతం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు'' అని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ స్పందిస్తూ.. ''సరోజ్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలి. సినీ ప్రేమికులకు, ఇండస్ట్రీకి మీరు లేని లోటు తీర్చలేనిది. రెండు వేల పాటలకు కొరియోగ్రఫీ చేసి.. పాటల రూపురేఖలనే మార్చేసారు. అల్లాదీన్ చిత్రంలో ఆమెతో ఓ పాట చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా లిస్ట్‌ లో ఆ ఒక్కటి ఉన్నందుకు సంతోషం'' అని చెప్పుకొచ్చాడు. ఇక అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ''లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మరణ వార్తతో నిద్ర లేచాను. ఎవరైనా డ్యాన్స్ చేయగలరు అని అనిపించేలా చేసింది. ఇండస్ట్రీకి ఆమె ఎంతో శూన్యాన్ని మిగిల్చింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాను'' అని ట్వీట్ చేసారు.

వీరితో పాటు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. హిందీ సినీ రంగంలో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన కొరియోగ్రాఫర్‌ గా పనిచేసిన సరోజ్‌ ఖాన్‌ మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటని.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కేసీఆర్‌ ప్రార్ధించారు. ఇక నమ్రతా శిరోద్కర్, తమన్నా, నిథి అగర్వాల్, మంచు మనోజ్, శ్రేయా ఘోషల్, ఫరాఖాన్, అమృతా రావ్, డైరెక్టర్ సంపత్ నంది, సోనూ సూద్ తో పాటు పలువురు ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.