Begin typing your search above and press return to search.

వోటు క్యూలో ర‌జ‌నీ - అజిత్ - విజ‌య్

By:  Tupaki Desk   |   18 April 2019 4:40 AM GMT
వోటు క్యూలో ర‌జ‌నీ - అజిత్ - విజ‌య్
X
నేడు త‌మిళ‌నాడు - క‌ర్నాట‌క‌ వ్యాప్తంగా ఎన్నిక‌ల కోలాహాలం నెల‌కొంది. స్టార్లు.. సూప‌ర్ స్టార్లు సైతం ఓటు క్యూలో నిలుచుని ఓట్లు వేస్తున్నారు. ముఖ్యంగా త‌మిళ‌నాడులో త‌లైవా ర‌జ‌నీకాంత్ - ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్.. త‌ళా అజిత్.. ద‌ళ‌ప‌తి విజ‌య్ క్యూలో నించుని ఓట్లు వేయ‌డం ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఓటు వేసేందుకు విచ్చేసిన స్టార్లు అంతా ఎంతో సాధాసీదాగా సామాన్య పౌరుడిలా ఎలాంటి హ‌డావుడి లేకుండా పోలింగ్ బూత్ కి వ‌చ్చి ఓటు వేసి వెళ్లారు. అందాల క‌థానాయిక శ్రుతిహాస‌న్ డాడ్ క‌మ‌ల్ హాస‌న్ తో క‌లిసి ఓటు వేసేందుకు విచ్చేశారు. విజ‌య్ ఆంథోని - విక్ర‌మ్ త‌దిత‌రులు ఓట్లు వేసారు.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నూగంబాక్కం స్టెల్లా మేరీస్ కాలేజ్ బూత్ లో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అజిత్ తిరువ‌న్మాయిర్ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. క‌మ‌ల్ హాస‌న్ - శ్రుతిహాస‌న్ ఆల్వార్ పేట్ లో ఓటేశారు. స్టార్లు ఓటు క్యూలోకి వ‌చ్చేప్పుడు అభిమానులు ఎంతో హుషారుగా అరుపులు కేక‌ల‌తో వెల్ కం చెప్పారు. త‌లైవా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. అభిమానుల్ని కంట్రోల్ చేస్తూ వారికి పోలింగ్ అధికారులు వెల్ కం చెప్పారు. పోలీసులు స్టార్ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా పోలింగ్ బూత్ ల వ‌ద్ద ప‌హారాను ఏర్పాటు చేశారు. 18 ఏప్రిల్ త‌మిళ‌నాడుకు ఎంతో కీల‌క‌మైన రోజు అనే చెప్పాలి. గ‌త కొంత‌కాలంగా త‌మిళ‌నాట అస్త‌వ్య‌స్థ స‌న్నివేశంలో అనూహ్యంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో స్టార్లు పెద్ద ఎత్తున నాయ‌కుల‌య్యారు. క‌మ‌ల్ హాస‌న్ మ‌క్క‌ల్ నీది మ‌య్యం ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుండ‌గా.. ర‌జ‌నీ పార్టీ మాత్రం పోటీకి దూరంగా నిలిచింది.

సినీ నటుడు - బెంగళూరు సెంట్రల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌ రాజ్ నేటి ఉద‌యం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు ప‌లువురు సినీ - టీవీ స్టార్లు నేటి ఉద‌యం ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డంతో క్యూ లైన్ల‌లో సంద‌డి నెల‌కొంది.