Begin typing your search above and press return to search.

సెన్సారోళ్లపై గొప్ప నటుడి ధ్వజం

By:  Tupaki Desk   |   3 Feb 2016 3:30 PM GMT
సెన్సారోళ్లపై గొప్ప నటుడి ధ్వజం
X
సెన్సార్ బోర్డుపై విమర్శలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. ఫిల్మ్ మేకర్స్ ఎంతగా తిట్టిపోస్తుంటే సెన్సార్ బోర్డు అధికారులు కూడా అంతగా తమ తిక్క చూపించి.. వివాదాన్ని మరింత పెంచుతున్నారు. ఆ మధ్య ‘జేమ్స్ బాండ్’ సినిమాలో ముద్దు సీన్ లెంగ్త్ కట్ చేయడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తన కొత్త సినిమా ‘అలీగఢ్’ ట్రైలర్ కు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై మండి పడ్డాడు నేషనల్ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్ పేయ్. ఇది ఓ ప్రొఫెసర్ నిజ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. హన్సల్ మెహతా రూపొందించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఆలోచన రేపే కథాంశంతో తెరకెక్కిన ఇలాంటి సినిమాను సెన్సార్ వాళ్లు మరో కోణంలో చూడటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు సెన్సార్ బోర్డన్నదే ఉండకూడదని.. దాన్ని రద్దు చేసి పారేయాలని అంటున్నాడు మనోజ్. ‘‘అసలు మా ట్రైలర్ కు ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకిచ్చారన్నదే అర్థం కావడం లేదు. ట్రైలరుకే ఈ సర్టిఫికెట్ ఇచ్చినపుడు ఇక సినిమా విషయంలో ఏం జరుగుతుందో అంచనా వేయగలం. ఒక గొప్ప సినిమాకు ఇలా చేయడం దారుణం. సెన్సార్ బోర్డు విధానంలో మార్పులు చేయాలని మా దర్శకుడు అంటున్నాడు. ఐతే నా దృష్టిలో మాత్రం సెన్సార్ బోర్డును తీసి పారేయడమే కరెక్ట్. సినిమాల్ని ఎవరో సెన్సార్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులే సెన్సార్ చేసుకుంటారు. ఒక సినిమాను చూడాలా వద్దా అని నిర్ణయించుకునేంత విజ్నత ప్రేక్షకులకు ఉంది’’ అని కుండబద్దలు కొట్టాడు మనోజ్.