Begin typing your search above and press return to search.

సంజుకు కత్తెర్లు తప్పవా?

By:  Tupaki Desk   |   3 Jun 2018 6:32 AM GMT
సంజుకు కత్తెర్లు తప్పవా?
X
బాలీవుడ్ తో పాటు ప్రేక్షక లోకం మొత్తం జూన్ 29 కోసం ఎదురు చూస్తోంది. కారణం సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ హిరానీ తీసిన సంజు విడుదల ఆ రోజే కాబట్టి.ట్రైలర్ విడుదల అయ్యాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వర్తమానంలో ఉన్న ఒక స్టార్ హీరో జీవితాన్ని మరీ ఇంత ఓపెన్ గా చూపిస్తారు అనేది ఎవరు ఊహించనిది. మున్నాభాయ్-పీకే-3 ఇడియట్స్ లాంటి సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన సిగ్నేచర్ స్టైల్ ఏర్పరుచుకున్న రాజ్ కుమార్ హిరానీ దీన్ని ఓ రేంజ్ లో తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. కానీ ట్రైలర్ మాత్రం కొత్త అనుమానాలకు తెర తీసింది. ఇందులో చూపించిన బోల్డ్ సీన్స్ రేపు సినిమాలో ఉండేలా సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడం అంత ఈజీగా కనిపించడం లేదు. సంజయ్ దత్ ను జైల్లో నగ్నంగా చెక్ చేయటం-సెప్టిక్ లీక్ అయిపోయి నేరుగా సంజయ్ ఉన్న జైలు గదిలోకి వచ్చేయటం-తాను డ్రగ్స్ కు ఎలా అలవాటు పడిందో చెబుతూ దాన్ని సవివిరంగా చూపించడం ఇవన్నీ అభ్యంతరాలకు అవకాశం ఇచ్చేవే.

దానికి తోడు ముంబై పేలుళ్ల కేసులో అక్రమాయుధాలు కలిగి ఉన్నాడన్న అభియోగం మీద చాలా కాలం జైల్లో ఉన్న సంజయ్ దత్ వాటిలో కొన్ని నిరూపణ కూడా కావడంతో శిక్ష అనుభవించాడు. కానీ ఇందులో సంజయ్ దత్ టెర్రరిస్ట్ కాదు ఏ తప్పు చేయలేదు అనే మెసేజ్ ని బలంగా చెప్పే ప్రయత్నం అయితే కనిపించింది. ఒకవేళ అదే నిజమైతే కనక కోర్ట్ తీర్పుని తప్పని చెప్పినట్టు అవుతుంది.సెన్సార్ బోర్డు సినిమా అనే కోణంలో సర్టిఫికెట్ ఇచ్చినా న్యాయ వ్యవస్థ తరపున ఎవరైనా కేసు వేస్తే ఇబ్బంది తప్పదు. సంజయ్ మీద సాఫ్ట్ కార్నర్ రావడం కోసం అతను తప్పే చేయలేదు అని చూపిస్తే మాత్రం రచ్చ గ్యారెంటీ. పీకే విడుదల టైంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి రాజ్ కుమార్ హిరానీ వాటి ద్వారా బోలెడు పబ్లిసిటీ సాధించుకున్నాడు. ఇప్పుడు సంజు ట్రైలర్ ని కావాలనే అలా కట్ చేయించి వివాదాలకు తెర తీస్తున్నాడు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. వీటికి క్లారిటీ సెన్సార్ కు వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఒకవేళ హిరానీ ఉద్దేశం అదే అయితే మాత్రం పద్మావత్ తరహా అడ్డంకులు చట్టపరంగా సంజుకు సైతం ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి