Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు 14 చోట్ల కోతలు పెట్టారట

By:  Tupaki Desk   |   13 July 2017 7:17 AM GMT
ఆ సినిమాకు 14 చోట్ల కోతలు పెట్టారట
X
ఈ మధ్య బాలీవుడ్లో బాగా చర్చనీయాంశం అవుతున్న సినిమా ‘ఇందు సర్కార్’. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పటి చీకటి రోజుల నేపథ్యంలో మాధుర్ భండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్ర ట్రైలర్.. ఇతర ప్రోమోలు చూస్తేనే ఇది పెను సంచలనాలకు తెర తీస్తుందని అర్థమైంది. ఇందిరా గాంధీని.. ఆమె తనయుడు సంజయ్ గాంధీని చెడుగా చూపిస్తున్నారంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ సినిమా విషయంలో గగ్గోలు పెడుతోంది.

సామాన్య జనాలు మాత్రం చరిత్రలో మరుగున పడిపోయిన నాటి రోజుల గురించి సినిమాలో ఏం చూపిస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ వివాదాస్పద సినిమా సెన్సార్ బోర్డు బ్రేకులేసింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఒకటి రెండు కాదు.. 14 చోట్ల కట్స్ చెప్పారట. దీనిపై దర్శకుడు మాధుర్ భండార్కర్ మండి పడుతున్నాడు. అన్ని కోతలు విధిస్తే ఇక సినిమా ఏం మిగులుతుందని అతను ప్రశ్నిస్తున్నాడు.

సినిమాలో మొరార్జీ దేశాయ్.. వాజ్‌ పేయి.. అద్వానీ వంటి అగ్రనేతల ఫొటోలతో ఉన్న ఇండియన్ హెరాల్డ్ పత్రిక కటింగుల్ని సినిమా నుంచి తొలగించాలని సీబీఎఫ్‌సీ ఆదేశించింది. అలాగే ‘అబ్ ఇస్ దేశ్ మే గాంధీ కే మైనే బదల్ చుకే హై (ఇప్పుడు ఈ దేశంలో గాంధీని నేను మార్చేశాను).. భారత్ కి ఏక్ బేటీ నే దేశ్ కో బందీ బనాయా హువా హై (భారత్‌ కు చెందిన ఓ బిడ్డ దేశంం మొత్తాన్ని బందీ చేసింది).. ఔర్ తుమ్ లోగ్ జిందగీ బర్ మా-బేటే కి గులామీ కర్తే రహోగే (మీరు జీవితాంతం తల్లీ-కొడుకులకు గులాంగిరీ చేస్తూనే బతికేస్తారా) లాంటి డైలాగుల్ని తీసేయాల్సిందిగా సెన్సార్ బోర్డు ఆదేశించింది. ఇంకా సినిమాలో ఉపయోగించిన పలువురు ప్రముఖుల పేర్లనూ మ్యూట్ చేయాలని స్పష్టం చేసింది.

దీనిపై మాధుర్ స్పందిస్తూ.. ‘‘సీబీఎఫ్‌ సీ సూచించిన కోతలు మమ్మల్ని తీవ్రమైన అసంతృప్తికి గురిచేశాయి. సెన్సార్ బోర్డు సిఫార్సు చేసిన కోతలన్నీ అదే బోర్డు సెన్సార్ చేసిన ట్రైలర్‌ లోనూ ఉన్నాయి. మరి అప్పుడు అనుమతించి సినిమాలో ఎందుకు తీసేయమంటున్నారు? అన్ని డైలాగులను తీసేస్తే.. సినిమాలో సారం ఏముంటుంది? వాటిని తీసేస్తే సినిమా ఉద్దేశమే మారిపోతుంది. కాబట్టి బోర్డు నిర్ణయాన్ని రివైజింగ్ కమిటీలో సవాలు చేస్తాం. అక్కడైనా మాకు న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అన్నాడు.