Begin typing your search above and press return to search.

న్యూస్ ఛానళ్లకు కేంద్రం ‘చెక్’.. కీలక మార్గదర్శకాలు జారీ..!

By:  Tupaki Desk   |   9 Jan 2023 5:30 PM GMT
న్యూస్ ఛానళ్లకు కేంద్రం ‘చెక్’.. కీలక మార్గదర్శకాలు జారీ..!
X
సెన్సేషనల్.. టీఆర్పీ కోసం న్యూస్ ఛానళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఒక్కోసారి జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చి మరీ కథనాలు ప్రసారం చేస్తుంటాయి. ఇక క్రైమ్ న్యూస్ విషయంలో ఈ పోకడలు మరింత శృతిమించుతుండటంతో కేంద్రం న్యూస్ ఛానళ్ల దూకుడుకు కేంద్రం తాజాగా చెక్ పెట్టింది.

టీవీ ప్రసారాలను ఇంటిపాది చూస్తుంటారని.. నేర వార్తల విషయంలో సంయమనం పాటించాలని కేంద్రం న్యూస్ ఛానళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేర వార్తల కవరేజ్.. టెలికాస్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సెన్సేషనల్.. బ్రేకింగ్ న్యూస్ ల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని స్పష్టం చేసింది.

ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ నేడు పలు మార్గదర్శకాలు.. నియమ నిబంధనలను విడుదల చేసింది. మహిళలు పిల్లలు వయోధిక వృద్ధులపై హింసాత్మక కథనాలను ప్రసారం చేయకూడదని పేర్కొంది. ప్రమాదాలు అసహజ మరణాలు తరచూ చోటు చేసుకునే హింసాత్మక సంఘటనలు కవర్ చేసే విషయంలో నైతిక విలువలు పాటించాలని సూచించింది.

ఇటువంటి వార్తల విషయంలో ఎలాంటి రాజీ ధోరణి ఉండకూడదని సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలోని అన్ని ప్రైవేట్ శాటిలైట్ ఛానళ్లలన్నీ కేంద్రం సూచించిన మార్గదర్శకాలు పాటించాలని పేర్కొంది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (కంట్రోల్) యాక్ట్ 1995లోని ప్రోగ్రామ్ కోడ్‌కు ఆయా టీవీ ఛానళ్ల యాజమాన్యం కట్టుబడి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రమాదాలు.. రక్తసిక్తమైన ఘటనలు.. గాయాలైన వ్యక్తులకు సంబంధించిన వివరాలను యధావిదిగా ప్రసారం చేయడం బాధాకరమని మంత్రిత్వ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బ్లర్ చేయడం లేదా లాంగ్ షాట్ గా చూపించాల్సి ఉంటుందని ఐ అండ్ బీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇటీవల టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంతో పాటు కొన్ని ఇతర నేర కథనాల కవరేజీ.. టెలికాస్ట్ ను అసహ్యకరమైనది.. హృదయాన్ని కదిలించేదిగా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. సాధారణంగా టీవీ ఛానళ్లను ఇంట్లోని పిల్లలు మహిళలు వృద్ధులు తిలకిస్తుంటారని.. వీరిని దృష్టిలో ఉంచుకొని నేర వార్తల కవరేజ్ చేయాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.