Begin typing your search above and press return to search.

ప్రతి దానికీ ఒక కారణం ఉంటుందని చెప్పేదే 'కార్తికేయ 2'

By:  Tupaki Desk   |   12 Aug 2022 3:45 AM GMT
ప్రతి దానికీ ఒక కారణం ఉంటుందని చెప్పేదే కార్తికేయ 2
X
చందూ మొండేటి ఇంతవరకూ చేసిన సినిమాలలో ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా 'కార్తికేయ'నే. అందువల్లనే ఆ సినిమాకి సీక్వెల్ గా ఆయన 'కార్తికేయ 2' సినిమాను రూపొందించాడు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగిపోనుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ .. "ఈ సినిమాను త్రీ .. ఫోర్ ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకూ ఉన్నవాళ్లు ఎంత ఎక్కువమంది చూస్తే అంత బాగుంటుంది.

మన రాముడు .. మన శివుడు .. మన కృష్ణుడు గురించి చాలా మందికి చాలా తక్కువ తెలుసు. చిన్న పిల్లలు ఇలాంటి సినిమాలు చూస్తే వాళ్లకి మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇలాంటి ఒక కంటెంట్ పై నాకు పట్టు రావడానికి కారణం మా పేరెంట్స్ అనే చెప్పాలి.

చిన్నప్పటి నుంచి రామాయణ భారతాలు నేను చదవడానికి కారకులు వారే. దైవత్వాన్ని వేరే కోణంలో చూడటం వల్లనే నేను ఈ సినిమాను తీయగలిగాను. విగ్రహాలకు పాలతో అభిషేకం ఎందుకూ? అనవసరంగా వేస్టు చేస్తున్నారని చాలామంది అనుకుంటారు.

మన పురాణాలు ఏది ఎందుకు చెబుతున్నాయి అనడానికి కారణాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలపై అవగాహన లేకుండా విమర్శించకూడదు. ఒక్కసారి మన పురాణాలు ఏం చెబుతున్నాయనేది తెలుసుకుంటే ఏ ఆచారం వెనుక ఏ అర్థం ఉందనేది అర్థమవుతుంది.

ప్రతి అంశం వెనుక చాలా పవర్ఫుల్ నిజాలు ఉంటాయి. అవి మన కల్చర్ కీ .. మన మనుగడకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి కొన్ని విషయాలను మా సినిమా ద్వారా చెప్పడానికి మేము ప్రయత్నించాము.

ప్రాజెక్టు పరంగా చెప్పుకోవాలంటే ముందుగా నిఖిల్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా విషయంలో నాకు ఆయన అందించిన సహాయ సహకారాలు అలాంటివి. ఈ సినిమాను గురించి ఇంకా చాలా సేపు .. చాలా విషయాలు మాట్లాడవలసి ఉంది. అవన్నీ కూడా సినిమా విడుదల తరువాత మాట్లాడతాను" అంటూ చెప్పుకొచ్చాడు. ద్వాపరయుగం .. ద్వారకా నగరం చుట్టూ ఈ కథ తిరగనుంది. అంతా ఆ జగద్గురు అధీనంలోనే ఉందనీ .. ఆయన కనుసన్నలలోనే నడుస్తుందనే సత్యాన్ని చాటిచెప్పే సినిమా ఇది.