Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడు నాగార్జునకు అంత పెద్ద ఫ్యాన్

By:  Tupaki Desk   |   18 Oct 2016 9:30 AM GMT
ఆ దర్శకుడు నాగార్జునకు అంత పెద్ద ఫ్యాన్
X
సినీ పరిశ్రమలో ఇప్పుడు గొప్ప గొప్ప స్థాయికి వెళ్లిన వాళ్లందరూ చాలా వరకు తమ చిన్నతనంలో.. యుక్త వయసులో ఏదో ఒక హీరోకు వీరాభిమానే అయ్యుంటారు. యువ దర్శకుడు చందూ మొండేటి కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అతను అక్కినేని నాగార్జునకు వీరాభిమాని అట. అతడికి నాగార్జునంటే ఎంత అభిమానమో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ అభిమానం ఎలాంటితో తెలుసుకుందాం పదండి.

‘‘నా బాల్యం.. విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. నా చిన్న తనంలో నా కజిన్స్ ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడేవాళ్లు. వాళ్లందరూ చాలా వరకు నాగార్జున ఫ్యాన్స్. నేను కూడా వాళ్ల బాటలోనే నడిచాను. నేను ఇంజినీరింగ్ చేరే సమయానికి అభిమానం మరింత పెరిగిపోయింది. చెన్నైలో ఇంజినీరింగ్ చేస్తున్నా సరే.. కాలేజీల్లో తెలుగు హీరోల అభిమానులకు గ్రూపులుండేవి. మొత్తం 500 మంది స్టూడెంట్స్ ఉంటే.. తెలుగోళ్లు 100-150 మంది మధ్య ఉండేవాళ్లు. అయినా అభిమానం విషయంలో అస్సలు తగ్గేవాళ్లం కాదు.

ఆగస్టు 22న చిరంజీవి గారి పుట్టిన రోజుకు అవతలి బ్యాచ్ చాలా హంగామా చేసేది. ఆగస్టు 29న నాగార్జున గారి పుట్టిన రోజుకు మేం అంత కంటే ఎక్కువ చేయాలని డబ్బులు పోగేసేవాళ్లం. కాలేజ్ అంతా కేకులు పంచేవాళ్లం. కాలేజీ ఫీజు కూడా దీనికే ఖర్చు చేసేవాడిని. మా పోటీని చూసి తమిళ కుర్రాళ్లు ఆశ్చర్యపోయేవాళ్లు. ఇక ఆడియోలు రిలీజైనపుడు క్యాసెట్లు కొనడంలోనూ పోటీ ఉండేది. ఇలాంటివి చాలా ప్రెస్టీజియస్ గా తీసుకునేవాళ్లం. ఇలాంటి వాటి వల్ల చాలా అప్పులు చేయాల్సి వచ్చింది.

ఓ సందర్భంలో నాకు చాలా తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. ఇక చచ్చిపోతానేమో అన్న భయం కలిగింది. నా రూంలో అప్పుడు ఎవ్వరూ లేరు. అలాంటి సందర్భం వచ్చినపుడు తల్లిదండ్రులతో పాటు జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులు గుర్తుకొస్తారు. నాకు మా పేరెంట్స్.. ఫ్రెండ్స్ తో పాటు నాగార్జున గారు కూడా గుర్తుకొచ్చారు. నాలాంటి వీరాభిమానిని ఆయన మిస్సయిపోతున్నారే అనుకున్నా. నాగార్జున తర్వాతి సినిమాలకు నాలాగా ఎవరు హంగామా చేస్తారు అని బాధపడ్డాను. ఐతే నాకు అప్పుడు ఏమీ కాలేదు.

ఆ తర్వాత గారిని కలవాలి అనుకున్నాను. ఐతే మా నాన్న ఓ సందర్భంలో ఓ మాటన్నారు. ఊరికే చూస్తే.. కలిస్తే ఏమొస్తుంది. నీకంటూ ఒక గుర్తింపు వచ్చాక ఆయన్ని కలువు అని. అదృష్టవశాత్తూ దర్శకుడిగా నాకంటూ ఓ పేరు సంపాదించి ఆయన్ని కలిశాను. ఇప్పుడు ఆయనతో పరిచయం పెరిగాక కూడా ఒక అభిమానిగా నాలో ఉన్న ఎగ్జైట్మెంట్ ఇప్పటికీ తగ్గలేదు. ఆయన్నుంచి ఒక ఫోన్ వచ్చినా చాలా ఎగ్జైట్ అయిపోతుంటా’’ అని చందూ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/