Begin typing your search above and press return to search.

మరణం తర్వాత కథ అంటున్న చందూ మొండేటి

By:  Tupaki Desk   |   9 Oct 2016 11:47 AM IST
మరణం తర్వాత కథ అంటున్న చందూ మొండేటి
X
తొలి సినిమా చేస్తున్న ఏ కుర్ర దర్శకుడైనా సేఫ్ గేమ్ ఆడటానికే ప్రయత్నిస్తాడు. ఒక ఫార్ములా కథను ఎంచుకుని కమర్షియల్ హంగులు జోడించి.. బాక్సాఫీస్ గండాన్ని దాటేద్దామని చూస్తాడు. కానీ చందూ మొండేటి మాత్రం అలా ఆలోచించలేదు. ‘కార్తికేయ’ రిస్క్ తో కూడుకున్న వైవిధ్యమైన కథను ఎంచుకున్నాడు. దాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశాడు. రెండో ప్రయత్నంలో మరో వైవిధ్యమైన కథతో సినిమా చేయాలనుకున్నాడు కానీ.. ‘ప్రేమమ్’ రీమేక్ చేయాల్సి వచ్చింది. స్వతహాగా రీమేక్ చేయడం ఇష్టం లేకున్నా సరే..చైతూ కోసం ఓకే అన్నాడు. రీమేక్ లోనూ తన సిన్సియారిటీ చూపించాడు. తనదైన శైలిలో ‘ప్రేమమ్’ను తెలుగీకరించాడు. మంచి ఫలితాన్నందుకున్నాడు.

ఇప్పుడిక చందూ తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతున్నాడు. అతడికి ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఆల్రెడీ ఐడ్రీమ్ ప్రొడక్సన్స్ వాళ్లకు ఓ సినిమా కమిటయ్యాడు. దిల్ రాజుతో పాటు ‘ప్రేమమ్’ తీసిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’తోనూ కమిట్మెంట్స్ ఉన్నాయి. నాగార్జున.. వెంకటేష్ లకు కూడా కూడా కథలు చెప్పాడట. అవి వాళ్లకు నచ్చాయట. ఇవి కాక తన దగ్గర చాలా కథలే ఉన్నాయంటున్నాడు చందూ. ముఖ్యంగా తనకు ఇష్టమైన సైన్స్ ఫిక్షన్ జానర్లో వైవిధ్యమైన కథలు రాసుకున్నట్లు అతను వెల్లడించాడు. విశేషం ఏంటంటే.. మరణం తర్వాత ఏం జరుగుతుందనే అంశంపైనా ఓ స్క్రిప్టు రెడీ చేసి పెట్టుకున్నాడట చందూ. అతను ఎలాంటి కథ తయారు చేశాడన్నది పక్కనబెడితే తెలుగులో ఓ దర్శకుడికి ఇలాంటి ఆలోచనతో కథ రాయాలనిపించడమే ఆశ్చర్యం. ఇంకా షెర్లాక్ హోమ్స్ పాత్రల స్ఫూర్తితోనూ ఓ స్టోరీ రాసినట్లు చెప్పాడు చందూ. చాలామంది కుర్రాళ్లలాగే ఇంజినీరింగ్ చదివి సినిమాల వైపు అడుగులేసిన చందూ.. ఇంత వైవిధ్యంగా ఆలోచించడం.. సైన్స్ ఫిక్షన్ సినిమాల మీద ఇంత ఆసక్తి.. క్లారిటీ ఉండటం గొప్ప విషయమే. ఇలాంటి ఎగ్జైటింగ్ డైరెక్టర్ల కోసమే టాలీవుడ్ చూస్తోంది ఇప్పుడు. అతడి నుంచి మరిన్ని వైవిధ్యమైన సినిమాలు వస్తాయని ఆశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/