Begin typing your search above and press return to search.

దాసరిగా అతను కాదు.. ఇతను

By:  Tupaki Desk   |   5 Nov 2018 11:06 AM GMT
దాసరిగా అతను కాదు.. ఇతను
X
నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ సినిమాలో వివిధ నిజ జీవిత పాత్రల కోసం ఇండస్ట్రీలోని చాలామంది ముందుకు వచ్చారు. బహుశా తెలుగు సినీ చరిత్రలోనే ఇంతమంది సినీ ప్రముఖుల్ని ఒకే సినిమాలో చూడటం జరిగి ఉండదేమో. ఎన్టీఆర్ సినీ.. రాజకీయ జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన ఎంతోమంది వ్యక్తుల పాత్రల్ని సినిమాలో చూపించబోతున్నారు. తాజాగా మరో ఆసక్తికర ఎంపిక జరిగింది ఈ చిత్రం కోసం. ఎన్టీఆర్ తో ‘బెబ్బులి పులి’ సహా అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకరత్న దాసరి నారాయణరావు పాత్ర కోసం విలక్షణ దర్శకుడు చంద్ర సిద్దార్థను ఎంచుకున్నట్లు సమాచారం.

లుక్ పరంగా దాసరి పాత్రకు అతను బాగా సూటవుతాడని భావిస్తున్నారు. స్వయంగా దర్శకుడు కాబట్టి దాసరి పాత్రను అతను బాగా పండించగలడని ఆశిస్తున్నారు. నిజానికి ఈ పాత్ర కోసం ముందు స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని తేలింది. చంద్రసిద్దార్థ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడని అనుకున్నారట. అతను కూడా సంతోషంగా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి ముందు దాసరితో చేసిన కొన్ని సినిమాలు.. ఆయన ఆలోచనల్ని చాలా ప్రభావితం చేశాయి. అలాగే ఎన్టీఆర్ రాజకీయ ఆలోచనల్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి.. ఆయన్ని ప్రజా నాయకుడిగా జనాలు గుర్తించడానికి ఆ సినిమాలు కొంత వరకు దోహదం చేశాయి. ఈ నేపథ్యంలో దాసరి మీద ఎన్టీఆర్ ప్రత్యేక అభిమానం చూపించేవారు. కాబట్టి సినిమాలో దర్శకరత్న పాత్ర కీలకంగా ఉంటుందని అంటున్నారు.