Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్పందించిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   2 May 2019 5:28 AM GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్పందించిన చంద్రబాబు
X
దివంగత ఎన్టీఆర్ చివరి రోజులను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాగా తీయడం..అందులో విలన్ గా చంద్రబాబును చూపించడం.. అది తెలుగు నాట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏపీలో విడుదల కాకుండా చంద్రబాబు తన అధికారాలు అన్నీ ఉపయోగించి అడ్డుకున్నారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ పై చంద్రబాబు ఇంత వరకు నేరుగా స్పందించింది లేదు.

తాజాగా అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై తొలిసారి స్పందించారు. తెలంగాణలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కొత్త సినిమా ఏం కాదని.. ఆ సినిమాతో నన్ను ఏమో చేయాలనుకున్నారు.. కానీ నాకే మాత్రం ఆందోళన లేదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక లక్ష్మీపార్వతి గురించి కూడా బాబు ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారు. ఆమె ఏ పార్టీలో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు అని.. ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు.

ఇక వర్మ సినిమాను విడుదల చేయడానికి విజయవాడ రాగా పోలీసులు అడ్డుకోవడంపై కూడా చంద్రబాబు నేరుగా స్పందించారు. ‘ఆయన రోడ్డుపై మీడియాతో మాట్లాడుతానన్నాడు.. రోడ్డుపై కాకుండా.. ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లవచ్చు.. అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోమనండి.. విజయవాడలో ఏం చేయలేడు’ అంటూ వర్మకు హెచ్చరికలు జారీ చేశారు.

అయితే వ్యూహాత్మకంగా చంద్రబాబు తన మాటల్లో రాంగోపాల్ వర్మ - లక్ష్మీపార్వతి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. పోలింగ్ పూర్తయ్యాక వరకే ఈసీ అడ్డుకుందని.. ఈసీ కోడ్ కారణంగా ఈ చిత్రం ఏపీలో విడుదల కాలేదని.. దానికి తనకు ఏమాత్రం సంబంధం లేదని.. మాట్లాడే ముందు హుందాగా.. డిగ్నిటీగా మాట్లాడాలని.. ఆ సినిమా విడుదలను తాను అడ్డుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.