Begin typing your search above and press return to search.

బోస్‌గారి పాట‌కి 8 అవార్డులట‌!

By:  Tupaki Desk   |   15 Sep 2015 7:30 AM GMT
బోస్‌గారి పాట‌కి 8 అవార్డులట‌!
X
ఎంత సూప‌ర్‌ హిట్ పాట‌కైనా రెండు మూడు అవార్డుల కంటే ఎక్కువ వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌దు. ప‌రిశ్ర‌మ‌లో బోలెడుమంది ర‌చ‌యిత‌లు ఉంటారు కాబ‌ట్టి... వాళ్లంతా పోటాపోటీగా పాట‌లు రాస్తుంటారు కాబ‌ట్టి ఒక్కో అవార్డు ఒక్కో పాట‌ని వ‌రిస్తుంటుంది. కానీ చంద్ర‌బోస్ రాసిన ఓ పాట‌ని మాత్రం ఏకంగా 8 అవార్డులు వ‌రించాయి. మున్ముందు ఆ సంఖ్య మ‌రింత పెరిగినా ఆశ్చ‌ర్యప‌డాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌. ఇంత‌కీ చంద్ర‌బోస్ రాసిన ఆ పాటేంటో తెలుసా? `మ‌నం`లోని `క‌నిపెంచిన మా అమ్మ‌కే...` పాట‌. త‌న త‌ల్లిదండ్రులు మ‌ళ్లీ పుట్ట‌డం, త‌న క‌ళ్ల‌ముందుకు రావ‌డంతో నాగార్జున పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాట వ‌స్తుంది. అయితే చిన్నారుల‌తో పాట పాడించారు. దీంతో ఆ పాట తెర‌పైనా, బ‌య‌టా వినేవాళ్ల‌కు ఎంతో హాయినిచ్చింది. శ్రావ్య‌మైన ఆ గీతం శ్రోత‌ల్ని అల‌రించ‌డంతో పాటు... అవార్డులు కూడా సొంతం చేసుకొంది. గామా - సైమా - ఫిల్మ్‌ ఫేర్‌ - సంతోషం... ఇలా మొత్తం ఎనిమిది పుర‌స్కారాలు ద‌క్క‌డంతో బోస్ ఆనందానికి అవధుల్లేవు.

అచ్చ‌మైన తెలుగులో అటు పండితుల‌కీ, ఇటు పామ‌రుల‌కీ అర్థ‌మ‌య్యేలా పాట రాయ‌డం చంద్ర‌బోస్ శైలి. `క‌నిపెంచిన మా అమ్మ‌కే...` పాట‌ని ఆయ‌న ఎంతో స‌ర‌ళంగా రాశారు. దీంతో అంద‌రూ హాయిగా పాడుకొంటున్నారు. ఈ పాట‌ని రాసినందుకు ప్ర‌ముఖ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి కూడా మెచ్చుకొన్నారట‌. అమూల్య‌మైన పాట రాశావంటూ కితాబునిచ్చార‌ట‌. ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌తో చంద్ర‌బోస్ మాట్లాడుతూ... ``సిరివెన్నెల సీతారామశాస్త్రిలాంటి ఓ ప్ర‌ఖ్యాత గీత ర‌చ‌యిత నుంచి `మంచి పాట రాశావ‌`ని కితాబునందుకోవ‌డం ఓ అద్వితీయ‌మైన అనుభూతి. ఆయ‌న `సిరివెన్నెల‌`లో రాసిన పాట‌కి మాత్రమే 14 అవార్డులొచ్చాయ‌ట అప్ప‌ట్లో. ఆ త‌ర్వాత ఎక్కువ సంఖ్య‌లో అవార్డులు వ‌చ్చింది నీ పాట‌కే అని ఆయ‌నే చెప్ప‌డం మ‌రింత ఆనందాన్నిచ్చింద``ని త‌న సంతోషం వ్య‌క్తం చేశారు బోస్‌. ఆయ‌న ఇటీవ‌ల `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌`కోసం రాసిన `తెలుగంటే గోంగూర‌` పాట కూడా శ్రోత‌ల్ని ఎంత‌గానో అల‌రిస్తోంది.