Begin typing your search above and press return to search.

గురువు అలా.. శిష్యుడు ఇలా!

By:  Tupaki Desk   |   24 Aug 2017 5:30 PM GMT
గురువు అలా.. శిష్యుడు ఇలా!
X
దర్శకుడికి మంచి టేస్టుంటే సరిపోదు.. మంచి సినిమా తీస్తే సరిపోదు.. దానికి డబ్బులు రావాలి. నిర్మాతను నిలబెట్టాలి. ఈ దర్శకుడితో చేస్తే కమర్షియల్ గా వర్కవుటవుతుందన్న భరోసా కల్పించాలి. మంచి అభిరుచి.. కంటెంట్ ఉన్న దర్శకులుగా పేరున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ లు ఇవ్వలేరన్న పేరుతో కొందరు దర్శకులు వెనుకబడిపోతుంటారు. ఈ కోవలోనే దర్శకుడే చంద్రశేఖర్ యేలేటి. ఇప్పుడందరూ కొత్తదనం కొత్తదనం అంటున్నారు కానీ.. దశాబ్దంన్నర కిందటే ‘ఐతే’ లాంటి సెన్సేషనల్ మూవీతో తెలుగు తెరలోకి కొత్తదనం తీసుకొచ్చాడు ఈ విలక్షణ దర్శకుడు. ‘ఐతే’ మాత్రమే కాదు.. ఆ తర్వాత అతను తీసిన ‘అనుకోకుండా ఒక రోజు’ అయినా.. ‘ఒక్కడున్నాడు’.. ‘ప్రయాణం’.. ‘సాహసం’ సినిమాలైనా అతడి అభిరుచిని చాటిచెబుతాయి.

కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. యేలేటి సినిమాలేవీ కూడా పెద్ద కమర్షియల్ సక్సెస్ కాలేదు. దీంతో మంచి సినిమాలు తీస్తాడు కానీ.. డబ్బులు తెచ్చిపెట్టడన్న ముద్ర పడిపోయింది. అందులోనూ గత ఏడాది యేలేటి నుంచి వచ్చిన ‘మనమంతా’ అయితే నిర్మాత సాయి కొర్రపాటికి చాలా నష్టమే మిగిల్చింది. ఇప్పుడు యేలేటి శిష్యుడైన హను రాఘవపూడి కూడా గురువు లాంటి ముద్రే వేయించుకుంటున్నాడు. హను తొలి సినిమా ‘అందాల రాక్షసి’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. కానీ దానికి డబ్బులు రాలేదు. ఆ చిత్రానికి కూడా సాయి కొర్రపాటే నిర్మాత కావడం గమనార్హం. రెండో సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఓకే అనిపించింది కానీ.. హను కొత్త సినిమా ‘లై’ మాత్రం తేడా కొట్టేసింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా నిలవలేకపోయింది. విపరీతమైన పోటీకి తోడు.. లిమిటెడ్ అప్పీల్ ఉన్న సినిమా కావడం వల్ల కూడా ఇది తేడా కొట్టేసింది. ‘లై’లో తన ప్రతిభ.. తన టేస్టు చూపించినప్పటికీ.. ఫెయిల్యూర్ డైరెక్టర్ గా నిలబడ్డాడు హను. గురువు లాగే అతడిదీ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితే. మంచి విషయం ఉన్న ఈ గురు శిష్యులు తమ శైలిని విడిచిపెట్టకుండానే.. కొత్తదనం పంచుతూనే కమర్షియల్ సక్సెస్ కూడా అందుకునేలా సినిమాలు తీయడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం. అదే సమయంలో ఇండస్ట్రీలో నిలవడానికి అవసరమైన మార్గమేంటో కూడా వాళ్లు చూసుకోవాలి. ఆ దిశగా తమ సినిమాలుండేలా జాగ్రత్తపడాలి.