Begin typing your search above and press return to search.

యేలేటి చెబుతున్నదాంట్లో లాజిక్కుంది

By:  Tupaki Desk   |   4 Aug 2016 5:30 PM GMT
యేలేటి చెబుతున్నదాంట్లో లాజిక్కుంది
X
ఖలేజా సినిమా థియేటర్లలో ఆడలేదు. కానీ టీవీల్లో మాత్రం సూపర్ హిట్. ఇదే మాట త్రివిక్రమ్ దగ్గర ప్రస్తావిస్తే ఓ వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్నాడు. దీనికి ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు అన్నాడు. ఓ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కితేనో.. టీవీల్లో బాగా ఆడితేనో సరిపోదు. థియేటర్లలో బాగా రన్ అయ్యి.. వసూళ్లు సాధిస్తేనే ఏ దర్శకుడికైనా ఆనందం. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సమస్య ఇదే. అతడి సినిమాలన్నీ విమర్శల ప్రశంసలు దక్కించుకున్నాయి. టీవీల్లో బాగా ఆడాయి. ఆడుతున్నాయి. ఐతే అయినా.. అనుకోకుండా ఒక రోజు అయినా.. సాహసం అయినా.. టీవీల్లో వస్తుంటే అతుక్కుపోయి చూస్తాం. కానీ ఈ సినిమాలు థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడాయంతే. ఎంతో విషయం ఉండి.. మంచి సినిమాలు తీసి కూడా ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ కమర్షియల్ అందుకోలేదు యేలేటి.

ఐతే ఒకప్పటి పరిస్థితుల్లో తన సినిమాలు ఆడలేదు కానీ.. ఇప్పుడు మాత్రం బాగా ఆడటానికి అవకాశముందని.. ‘మనమంతా’తో కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ కొడతానని అంటున్నాడు యేలేటి. ‘‘నా సినిమాలు విడుదలైన కొన్నేళ్లకు ప్రశంసలు అందుకుంటున్నాను. టీవీల్లో అందరూ ఆసక్తిగా చూస్తున్నట్లు చెబుతున్నారు. అనుకోకుండా ఒకరోజు నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్. అది అప్పట్లో ఎందుకు బాగా ఆడలేదో అర్థం కాలేదు. ప్రయాణం సినిమా రీమేక్ రైట్స్ కావాలని ఇప్పుడు నన్నుడగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్పట్లో మల్టీప్లెక్సులు పెద్దగా అందుబాటులో లేకపోవడం.. ఓవర్సీస్ మార్కెట్ విస్తరించకపోవడమే నా సినిమాలు బాగా ఆడకపోవడానికి కారణం అనుకుంటున్నా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అర్బన్ ఆడియన్సుకి నచ్చితే సినిమా బాగా ఆడేందుకు అవకాశాలున్నాయి. మనమంతా నా కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా’’ అని యేలేటి చెప్పాడు. యేలేటి చెబుతున్నదాంట్లో నిజంగానే లాజిక్కుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారింది. వైవిధ్యమైన చిత్రాల్ని బాగా ఆదరిస్తున్నారు. ఇందుకు క్షణం.. పెళ్లిచూపులు లాంటి సినిమాలే ఉదాహరణ. ఇలాంటి సినిమాలకు మల్టీప్లెక్సుల్లో మంచి ఆదరణ దక్కుతోంది. ఓవర్సీస్ మార్కెట్ కూడా బాగా కలిసొస్తోంది. మరి యేలేటి ఆశిస్తున్నట్లే ‘మనమంతా’ పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందేమో చూద్దాం.