Begin typing your search above and press return to search.

`ప్రేమ‌మ్‌`పై మ‌న‌సుప‌డ్డ చైతూ, చందు!

By:  Tupaki Desk   |   1 Aug 2015 5:38 AM GMT
`ప్రేమ‌మ్‌`పై మ‌న‌సుప‌డ్డ చైతూ, చందు!
X
అన‌గ‌న‌గా ఓ ద‌ర్శ‌కుడు. ఆయ‌న ఓ హీరోని దృష్టిలో ఉంచుకొని మంచి క‌థ‌ని త‌యారు చేసుకొన్నాడు. ఆ హీరోకి కూడా క‌థ బాగా న‌చ్చింది. ఇక సినిమా సెట్స్‌ పైకి వెళ్ల‌డ‌మే ఆల‌స్యం. ఇంత‌లో ఆ హీరో, ద‌ర్శ‌కుడు క‌లిసి స‌ర‌దాగా వేరొక భాష‌లో వ‌చ్చిన సినిమాని చూశారు. ఇద్ద‌రికీ ఆ సినిమా పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. న‌టిస్తే ఇలాంటి సినిమాలో న‌టించాల‌ని ఆ హీరో అనుకొన్నాడు. తీస్తే ఇలాంటి క‌థ‌ని తీయాల‌ని ఆ ద‌ర్శ‌కుడూ అనుకొన్నాడు. అలా ఇద్ద‌రి అభిప్రాయాలు ఒక‌టే కావ‌డంతో.. తాము అనుకొన్న క‌థ‌ని ప‌క్క‌న‌పెట్టి చూసిన సినిమానే రీమేక్ చేయాల‌ని ఫిక్స్ అయిపోయారు. అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌, `కార్తికేయ‌` ఫేమ్ చందు మొండేటిల క‌థే ఇది.

`కార్తికేయ‌`తో ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు చందు మొండేటి. ఆయ‌న సినిమాని తీసిన విధానం, సంభాష‌ణ‌లు రాసుకొన్న తీరు ప్రేక్ష‌కుల‌కు భ‌లే న‌చ్చింది. స్టార్ ద‌ర్శ‌కుడు అయిపోయే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని సినిమా విమ‌ర్శ‌కులు తేల్చి చెప్పారు. అంతగా పేరు తెచ్చుకొన్నాక ఆఫ‌ర్లు రాకుండా ఉంటాయా? చందు మొండేటికి అన్న‌పూర్ణ స్టూడియో కాంపౌండ్ నుంచి పిలుపొచ్చింది. అందులో భాగంగానే నాగ‌చైత‌న్య‌ తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకొన్నాడు చందు. మంచి క‌థ‌ని చెప్పి ఒప్పించాడు.

ప్ర‌స్తుతం గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా పూర్త‌వ్వ‌గానే చైతూ త‌దుప‌రి చందు సినిమాకోస‌మే రంగంలోకి దిగాల‌నుకొన్నాడు. కానీ ఇంత‌లో ఇద్ద‌రూ క‌లిసి `ప్రేమ‌మ్‌` చూశార‌ట‌. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ఆ సినిమాని చూడ‌గానే చైతూ, చందు ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోయారు. మ‌న‌మే క‌లిసి ఆ సినిమాని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచ‌న రావ‌డమే ఆల‌స్యం వెంట‌నే కార్య‌చ‌ర‌ణ మొద‌లుపెట్టారు. నిర్మాత కె.రాధాకృష్ణ‌తో సినిమా రీమేక్ హ‌క్కులు కొనిపించ‌డం, స్క్రిప్టు ప‌నులు మొద‌లుపెట్ట‌డం చ‌క‌చ‌గా జ‌రిగిపోయాయి. ప్ర‌స్తుతం తెలుగు `ప్రేమ‌మ్‌` స్క్రిప్టు ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. చైతూ కోసం చందు రాసిన అస‌లు క‌థ త‌దుప‌రి వేరొక హీరోతో తీయాల‌ని ఫిక్స‌య్యార‌ట‌. వీలైతే ఆ సినిమాని నాగ‌చైత‌న్య‌ తోనే తీయొచ్చంటున్నారు. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన `ప్రేమ‌మ్‌`పై బోలెడంత మంది హీరోలు, ద‌ర్శ‌కులు మ‌న‌సుపడ్డారు. చివ‌రికి ఆ క‌థ చైతూ, చందు మొండేటిల సొంత‌మైంద‌న్న‌మాట‌