Begin typing your search above and press return to search.

ఇఫా గౌర‌వం ముంగిట చందు మొండేటి

By:  Tupaki Desk   |   23 Nov 2015 5:06 AM GMT
ఇఫా గౌర‌వం ముంగిట చందు మొండేటి
X
పువ్వు పుట్ట‌గానే ప‌రిమిళస్తుంది అన్న సామెత‌ని నిజం చేసిన ద‌ర్శ‌కులు మ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలా మందే ఉన్నారు. వాళ్లంతా తొలి ప్ర‌య‌త్నంలోనే స‌త్తా చూపిన కెప్టెన్ల‌న్న‌మాట‌. వాళ్లు తీసిన సినిమా చూడ‌గానే ప్రేక్ష‌కులు, ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చిత్ర‌సీమ‌లో ప్ర‌యాణం చేసే బహుదూర‌పు బాట‌సారులు అని ప‌క్కాగా చెప్పేశారు. అనుకున్న‌ట్టుగానే వాళ్ల గ‌మ‌నం ఆ దిశ‌గానే సాగింది. ఆ త‌ర‌హా ద‌ర్శ‌కుల జాబితాని ప‌రిశీలిస్తే రామ్‌ గోపాల్ వ‌ర్మ‌ - పూరి జ‌గ‌న్నాథ్‌ - రాజ‌మౌళి - సుకుమార్‌.... ఇలాంటి పేర్లు క‌నిపిస్తాయి. కొంత‌కాలం క్రిత‌మే ఆ ద‌ర్శ‌కుల జాబితాలోకి మ‌రొక‌రు చేరారు. ఆయ‌నే చందు మొండేటి. కార్తికేయ చిత్రంతో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడీయ‌న‌.

కార్తికేయ సినిమాని చూడ‌గానే విమ‌ర్శ‌కులు వంద‌కి వంద వేసేశారు. ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు - ప్రేక్ష‌కులు ఆ సినిమాకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడు కూడా ఆ సినిమాని చూస్తే ``ఈ ద‌ర్శ‌కుడు ఒక ప‌ది - ప‌దిహేను సినిమాలైనా తీసుంటాడు`` అనుకొంటాం కానీ కొత్త ద‌ర్శ‌కుడు అని మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లోనూ అనుకోలేం. అంత ప‌క్కా స్క్రీన్‌ ప్లే తో - అంత బిగువైన స‌న్నివేశాల‌తో ఆ సినిమాని తీశాడు చందు. అందుకే రాజ‌మౌళి లాంటి అగ్ర ద‌ర్శ‌కులు సైతం ఆ సినిమాని మెచ్చుకొన్నారు. కార్తికేయ త‌ర్వాత చందుకి ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌లు పిలిచి మ‌రీ అవ‌కాశాలిచ్చాయి. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌మ్ సినిమాని రీమేక్ చేసే ప‌నిలో ఉన్నాడాయ‌న‌.

తొలి ప్ర‌య‌త్నంతోనే శ‌భాష్ అనిపించుకొన్న చందు తాజాగా ఓ అరుదైన గౌర‌వం ముంగిట నిలుచున్నాడు. ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ అకాడ‌మీ (ఇఫా) హైద‌రాబాద్‌ లో ఇఫా ఉత్స‌వం పేరుతో ఓ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. అందులో ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా చందు నామినేట్ అయ్యాడు. పుర‌స్కారం కోసం రాజ‌మౌళి (బాహుబ‌లి) - పూరి జ‌గ‌న్నాథ్ (టెంప‌ర్‌) - కొర‌టాల శివ (శ్రీమంతుడు) త‌దిత‌ర ద‌ర్శ‌కుల‌తో పోటీ ప‌డుతున్నాడు. పురస్కారం ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న‌ది ప‌క్క‌న‌పెడితే చందు తొలి ప్ర‌య‌త్నంతోనే ఇంత‌గా ప‌రిశ్ర‌మ‌నీ - ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం మాత్రం విశేష‌మ‌ని చెప్పాలి.