Begin typing your search above and press return to search.

పవన్ రీ ఎంట్రీ తో మారనున్న మెగా సమీకరణాలు?

By:  Tupaki Desk   |   22 Nov 2019 11:49 AM GMT
పవన్ రీ ఎంట్రీ తో మారనున్న మెగా సమీకరణాలు?
X
టాలీవుడ్ లో అత్యధిక హీరోలు ఉన్న సినీ కుటుంబం మెగా ఫ్యామిలీ. అంతే కాదు మెగా ఫ్యామిలీ హీరోలకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. అందుకే మెగా హీరో టాగ్ పడితే చాలు హీరోగా సెట్ అయిపోయినట్టే అనే అభిప్రాయం ఉంది. అయితే మెగా హీరోల సంఖ్యా ఎక్కువ కావడంతో అసలు అందరి మధ్య సఖ్యత ఉందా అనే అనుమానాలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యాన్స్ కాకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ వేరుకుంపటి పెట్టుకోవడం..మరి కొన్ని ఇతర సంఘటనలతో మెగా హీరోల మధ్య పైకి కనిపించినంత సఖ్యత లేదని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా మెగా టాగ్ పడిన ప్రతి హీరో 'స్టార్' అనే అభిప్రాయంలో ఉన్నరని కూడా ఒక టాక్ ఉంది.

మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ ఎప్పుడూ నంబర్ వన్. అందులో మరోమాటకు తావులేదు. అయితే చిరు తర్వాత స్థానం ఎవరిదనే విషయంలో కూడా చాలా పోటీ ఉందని అంటున్నారు. నిన్న మొన్నటివరకూ ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండేవారు. చిరు రేంజ్ లో ఫాలోయింగ్.. ఇమేజ్ సాధించిన హీరో పవన్. అయితే ఈమధ్య పవన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. దీంతో చిరు తర్వాత స్థానం కోసం పోటీ ముఖ్యంగా అల్లు అర్జున్.. రామ్ చరణ్ మధ్యలో ఉంది. విజయాల శాతం చూస్తే అల్లు అర్జున్ రెండు అడుగులు ముందే ఉన్నప్పటికీ మార్కెట్ స్టామినా విషయంలో చరణ్ రెండాకులు ఎక్కువే. 'మగధీర'.. 'రంగస్థలం' లాంటి రికార్డులు బద్దలు కొట్టే సినిమాలు చరణ్ కెరీర్ లో ఉన్నాయి. అలాంటి సినిమాలు అల్లు అర్జున్ కెరీర్ లో లేవు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రభావం మెగా ఫ్యామిలీలో ఎవరిమీద పడుతుందో వేచి చూడాలి. పవన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమయంలో పవన్ అభిమానుల మద్దతు ఎక్కువగా చరణ్ కు దక్కిందని ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంటుంది. మరి పవన్ రీ ఎంట్రీ తర్వాత కూడా అలానే కొనసాగుతుందా అనేది ఆసక్తికరం.

ఇక పవన్ రీఎంట్రీ పై మెగా ఫ్యామిలీ సభ్యుల స్పందన ఎలా ఉంది అనే అంశంపై విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ రీఎంట్రీ ఇచ్చి సినిమాలు చేసే సమయంలో నాగబాబు జనసేన పార్టీపై పట్టు సాధించాలని.. పవన్ కు బదులుగా పార్టీ వ్యవహారాలు చక్కదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వాదన వినిపిస్తోంది. పవన్ సినిమాలు చేసే సమయంలో పవన్ స్థానంలో నాగబాబు ఉండాలని ఆశిస్తున్నారట. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ సమయంలో పవన్ రీఎంట్రీ ఇవ్వడం మెగాస్టార్ కు ఇష్టం లేదా అనే కోణంలో కూడా కొందరు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అయితె మెగా ఫ్యామిలీ సన్నిహితులు మాత్రం ఈ వాదనను నిరాధారమని తోసిపుచ్చుతున్నారు. పవన్ రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాలు కూడా చేయాలని కోరే వారిలో అన్నయ్య చిరంజీవి మొదటివారని.. పవన్ సినిమాలు చేయడం మానకూడదనేది చిరు అభిమతమని వారు అంటున్నారు. పవన్ రీ ఎంట్రీ తర్వాత మెగా ఫ్యామిలీలో సమీకరణాలు ఎలా మారాతాయో వేచి చూడాలి.