Begin typing your search above and press return to search.

'గాడ్ ఫాదర్'లో ఏం మారింది?

By:  Tupaki Desk   |   29 Sep 2022 5:23 AM GMT
గాడ్ ఫాదర్లో ఏం మారింది?
X
మెగాస్టార్ చిరంజీవి మూవీ 'గాడ్ ఫాదర్' విడుదలకు ఇంకో వారం కూడా సమయం లేదు. విడుదల ముంగిట ప్రమోషన్ల విషయంలో చిత్ర బృందం కొంత వెనుకబడి ఉన్న మాట వాస్తవం. ఐతే రిలీజ్ వీక్‌లోకి అడుగు పెట్టేసరికి చిత్ర బృందం కొంచెం స్పీడు పెంచింది. అనంతపురంలో ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి.. అక్కడే ట్రైలర్ లాంచ్ చేసింది.

బుధవారం సాయంత్రం విడుదలైన 'గాడ్ ఫాదర్' మాస్ ప్రేక్షకులను బాగానే ఆకర్షిస్తోంది. ఇందులో చిరు లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ అన్నీ కూడా అభిమానులను అలరించేలా ఉన్నాయి.

ఇక ట్రైలర్ లాంచ్ తర్వాత అందరూ ఈ చిత్రాన్ని 'లూసిఫర్'తో పోల్చి చూడడం మొదలుపెట్టారు. ఈ మలయాళ సినిమా అమేజాన్ ప్రైంలో తెలుగులో కూడా అందుబాటులో ఉండడం, ఇది మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ మాస్ మసాలా సినిమా కావడంతో మన వాళ్లు బాగానే చూశారు.

ట్రైలర్‌ను బట్టి చూస్తే మాతృకతో పోలిస్తే కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 'లూసిఫర్'లో ఉన్న హీరో కజిన్, ఫారిన్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే టొవినో థామస్ పాత్ర ఇందులో లేదు. దాన్ని పూర్తిగా లేపేసినట్లున్నారు. దాని స్థానంలో మాతృకలో జస్ట్ హౌస్ వైఫ్ లాగా ఉండే మంజు వారియర్ పాత్రలో నయనతారను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినట్లున్నారు.

ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్‌ను బట్టి అందరూ సత్యదేవ్ టొవినో పాత్రలో నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ అతణ్ని వివేక్ ఒబెరాయ్ స్థానంలో విలన్ పాత్రలో చూపించబోతున్నారని స్పష్టమైంది. కాకపోతే మాతృకతో పోలిస్తే అతడి పాత్రలోనూ కొన్ని మార్పులు చేర్పులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ముందు నుంచి అనుకున్నట్లే సల్మాన్ ఒరిజినల్లో పృథ్వీరాజ్ చేసిన క్యామియో రోల్‌లో కనిపించనున్నాడు. చిరంజీవి పాత్రకు సంబంధించి పెద్దగా మార్పులేమీ కనిపించడం లేదు. ఆయన పాత్రను అభిమానుల అభిరుచికి తగ్గట్లు ఇంకొంచెం మాసీగా మార్చినట్లున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.