Begin typing your search above and press return to search.

'నా కొడుకు నన్ను అక్క అంటాడు' సీనియర్ నటి

By:  Tupaki Desk   |   24 April 2020 11:30 PM GMT
నా కొడుకు నన్ను అక్క అంటాడు సీనియర్ నటి
X
సినీ ప్రపంచంలో ముఖానికి ఉన్న రంగు మాత్రమే మనకు కన్పిస్తుంది. కాని రంగుల వెనుక జీవిత వ్యధలు చాలానే ఉంటాయి. ఇలాంటి జీవితమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాగిణిది. 30ఏళ్ల నట ప్రస్థానంలో రాగిణి పెద్దగా పరిచయం లేకపోయినా ఆమె ముఖం చూస్తే ప్రతీ ఒక్కరూ గుర్తుపడతారు. దూరదర్శన్ సీరియల్స్‌తో ఎంట్రీ ఇచ్చి.. సుమారు 550 పైగా సీరియల్స్‌లో, 190 పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల్ని మెప్పించింది. అమృతం, మై నేమ్ ఈజ్ మంగతాయారు, శశిరేఖా పరిణయం, అగ్నిసాక్షి, నాన్న, మా కోడలు బంగారం చాలా సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా సీరియల్స్ లేడీ విలన్‌గా అద్భుత నటనను ప్రదర్శిస్తున్నారు రాగిణి.

సినిమాల్లో చంటబ్బాయి, గణేష్, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, అష్టాచెమ్మా, ఈరోజుల్లో, జులాయి, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు ఇలా పలు హిట్ చిత్రాల్లోనూ భాగం పంచుకున్నారామె. 30 ఏళ్ల సినిమా ప్రయాణంలో వివిధ రకాల మనుషుల్ని చూసి.. వివిధ మనస్తత్వాలను చదివింది.

రాగిణి అక్కాచెల్లెల్లు మొత్తం 13 మంది. ఈమె 12వ సంతానం. ఆ టైమ్‌లో కుటుంబ పోషణకోసం హైదరాబాద్‌లో డాన్స్ గ్రూపుల్లో నెల అంతా కష్టపడితే మూడువేల రూపాయలు వచ్చేవి. వాటితో కుటుంబపోషణతో పాటు ఖర్చులు చూసుకునేది. ఆ టైంలో హీరోయిన్ అయ్యే అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ తగిన ప్రోత్సాహం, ఆర్థిక పరిస్థితుల కారణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే మిగిలిపోయింది రాగిణి.

తన వైవాహిక జీవితం గురించి చెప్తూ.. ‘నాకు 12 ఏళ్లు వయసప్పుడు ఒకతనికిచ్చి పెళ్లి చేశారు. సరిగ్గా ఏడాది పాటు మా కాపురం బాగానే సాగింది. ఓ ఏడాదిలో నాకు ఒక బాబు పుట్టాడు. డబ్బులు కోసం ఏమైనా చేయి.. ఎవరిదగ్గరికైనా వెళ్లి సంపాదించు అనేవాడు. అతని ఉద్దేశం తెలిసిన తరువాత నాకు అవసరం లేదు. నీ దారి నువ్వు చూసుకో అని చెప్పేశా. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎవరితోనూ చెప్పుకోలేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమందికి మాత్రమే తెలుసు. నాకు పుట్టిన కొడుకుని అక్క పిల్లలుగా పెంచడంతో వాడు కూడా నన్ను అక్కా అనే అంటాడు. అమ్మ అని అనడు. నా కొడుకు పేరు కిరణ్. వాడికి అన్నీ తెలుసు నేనే అమ్మ అని. బాగా చదివించా వాడిని. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. జర్మనీలో ఉన్నాడు. నన్ను బాగా చూసుకుంటున్నాడు. ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఈ జన్మకు ఇక ఇంతే. ప్రస్తుతం చాలా హ్యాపీ.

ఇండస్ట్రీలో ఎవరితో ఎంత వరకూ ఉండాలో అంతే ఉంటే మంచిది. అలా కాకుండా ఏంటి సార్ బాగున్నారా.. అంటూ దగ్గరగా వెళ్తే రాత్రికి వస్తావా? అంటారు. అలా కాకుండా నమస్కారం సార్ అని సంస్కారంగా మాట్లాడితే ఎవరూ మన జోలికి రారు. మన బిహేవియర్‌ని బట్టే వాళ్ల రియాక్షన్ ఉంటుంది. ప్రామిస్‌గా చెప్తున్నా నన్ను అయితే ఎవరూ అలాంటి ఇబ్బంది పెట్టలేదు. నాకు చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు ఫోన్ చేసి చెప్పేవారు. టీవీ ఆర్టిస్ట్‌లు అంటే ఇండస్ట్రీలో చిన్న చూపు ఉంటుంది. చాలా సందర్భాల్లో బాధగా అనిపిస్తుంది. పేమెంట్స్ కూడా టీవీలో చేస్తామనే కారణంతో చాలా తక్కువగా ఇస్తారంటూ.. తన లైఫ్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులను షేర్ చేసుకుంది.