Begin typing your search above and press return to search.

చరణ్ శంకర్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   4 Oct 2021 11:30 PM GMT
చరణ్ శంకర్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌
X
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ మరియు సౌత్ దిగ్గజ దర్శకుడు శంకర్ ల కాంబోలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు భారీ ఎత్తున జరిగాయి. ఇప్పటి వరకు సినిమా కు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించారు. భారీ సెట్టింగ్స్ తో పాటు డైలాగ్‌ వర్షన్‌ ను ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని చివరకు పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యారు. మొదటి షెడ్యూల్‌ ను పూణె లో వేసిన భారీ సెట్టింగ్‌ లో నిర్వహించబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి షెడ్యూల్‌ లోనే చరణ్ మరియు కియారాల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూణెలో చకచక జరుగుతున్నాయి. భారీ స్థాయి బడ్జెట్‌ తో రూపొందబోతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ ను దాదాపుగా నెల రోజుల పాటు నిర్వహిస్తారట. ఆ తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకుని మళ్లీ రెండవ షెడ్యూల్‌ ను ప్రారంభిస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ ద్వారా తెలుస్తోంది.

కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రేజీ బ్యూటీ. అక్కడ యంగ్‌ స్టార్స్ అంతా కూడా ఆమెను కోరుకుంటున్నారు. ఆమె ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాలను కమిట్ అయ్యి ఉంది. శంకర్ మూవీకి గాను ఎప్పడు అడిగితే అప్పడు డేట్లు ఇచ్చేట్లుగా ముందస్తు ఒప్పందం చేసుకోవడం జరిగిందట. అందుకు గాను నిర్మాత దిల్ రాజు ఆమెకు భారీ పారితోషికంను ముట్టజెప్పుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం అక్టోబర్ మూడవ వారం నుండి దాదాపుగా 20 రోజుల కాల్షీట్లను హీరోయిన్ కియారా అద్వానీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ లో చరణ్ మరియు కియారా అద్వానీలపై ఒక మంచి సాంగ్‌ ను చిత్రీకరించబోతున్నారట. అందుకోసం ఇప్పటికే సంగీత దర్శకుడు పాటను కూడా రికార్డ్‌ చేశారని అంటున్నారు.

రామ్‌ చరణ్ ఆర్ ఆర్‌ ఆర్‌ పనులు అన్నింటిని ముగించుకున్నాడు. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలను కూడా ముగించుకున్న ఆయన డిసెంబర్ లో సినిమా ప్రమోషన్ కోసం రెండు లేదా మూడు వారాలు ఆ తర్వాత జనవరిలో ఒక వారం కేటాయించాల్సి ఉందట. మొత్తంగా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ప్రమోషన్‌ కోసం ఇద్దరు హీరోలు కూడా నెల రోజుల సమయంను కేటాయించాల్సిందిగా జక్కన్న కోరాడట. అందుకోసం ఆ ఇద్దరు హీరోలు కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. సంక్రాంతి ముందు వారంలో విడుదల కాబోతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తర్వాత శంకర్‌ తో చేయబోతున్న సినిమాను కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల చేసేలా చరణ్ ప్లాన్‌ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. వచ్చే ఏడాది మిస్ అయితే 2023 లో మళ్లీ సంక్రాంతి బరిలో చరణ్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.