Begin typing your search above and press return to search.

దేవిశ్రీ కన్నా ఛార్మినే ఎమోషనల్

By:  Tupaki Desk   |   24 Dec 2015 5:30 PM GMT
దేవిశ్రీ కన్నా ఛార్మినే ఎమోషనల్
X
దేవిశ్రీ ప్రసాద్ కు తన తండ్రి సత్యమూర్తి అంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన ప్రతి ఆడియో ఫంక్షన్ కూ తండ్రిని తీసుకొచ్చి ఆయన ముందు పెర్ఫామ్ చేసి.. వేదిక మీద ఆయన గురించి మాట్లాడి తన ప్రేమను ప్రకటిస్తూ ఉంటాడు దేవి. ఫ్రెండులా, గైడ్ లా తనకు అండగా నిలిచిన తండ్రి పది రోజుల కిందట తరలి రాని లోకాలకు వెళ్లిపోవడం చూసి దేవి ఎలా విలవిలలాడిపోయాడో అందరూ చూశారు.

తండ్రి పోయాడన్న బాధ ఉన్నా.. ఆయన తనేం చేస్తే ఆనందిస్తాడో గుర్తుంచుకుని తన సినిమాలకు సంబంధించిన వర్క్ కొనసాగించడం దేవిశ్రీ గొప్పదనాన్ని తెలియజేస్తుంది. మొన్నటిదాకా ఆ పనుల్లోనే ఉన్న దేవి.. ఇవాళ తండ్రికి 11వ రోజు కార్యక్రమం నిర్వహించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్లో తన తండ్రితో తాను కలిసున్న ఫొటోతో పాటు.. సత్యమూర్తి యవ్వనంలో ఉన్న ఫొటో కూడా పెట్టి ఎమోషనల్ అయ్యాడు దేవి.

ఐతే ఈ సందర్భంగా దేవి కంటే కూడా అతడి స్నేహితురాలు ఛార్మి ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. ఆమె కూడా సత్యమూర్తి యవ్వనంలో ఉన్న కొన్ని ఫొటోల్ని షేర్ చేసింది. అవి దేవి ఇంట్లో అలంకరించిన చిత్రాలు. దేవి ఫ్రెండుగా ఛార్మికి కూడా సత్యమూర్తి బాగానే క్లోజ్. అందుకే ఆయన మరణం ఆమెను కూడా బాగానే బాధించింది.