Begin typing your search above and press return to search.

కబాలి ఆగే ప్రసక్తే లేదు..

By:  Tupaki Desk   |   21 July 2016 12:17 PM GMT
కబాలి ఆగే ప్రసక్తే లేదు..
X
కబాలి రిలీజ్ విషయంలో అడ్డంకులన్నీ తొలగిపోయాయి. శుక్రవారం యధావిధిగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ‘కబాలి’ విడుదలను అడ్డుకోవడానికి తమిళనాట కొందరు డిస్ట్రిబ్యూటర్లు గట్టి ప్రయత్నమే చేశారు. ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఐతే ‘కబాలి’ రిలీజ్ పై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. డిస్ట్రిబ్యూటర్ల పిటిషన్ ను కొట్టేసింది. దీంతో నిర్మాత కలైపులి థాను ఊపిరి పీల్చుకున్నాడు.

రజినీకాంత్ హీరోగా నటించిన ‘లింగా’ సినిమా కారణంగా తాము తీవ్రంగా నష్టపోయానని.. ఆ నష్టాల్ని భర్తీ చేస్తానన్న రజినీకాంత్ మాట నిలబెట్టుకోలేకపోయారని డిస్ట్రిబ్యూటర్లు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసే వరకు ‘కబాలి’ విడుదల కాకుండా ఆపాలని వారు కోర్టును కోరారు. ఐతే ఇందుకు హైకోర్టు నిరాకరించింది. ‘లింగా’కు ‘కబాలి’కి సంబంధం లేదంటూ.. ఈ సినిమాను యధావిధిగా విడుదల చేయడానికి లైన్ క్లియర్ చేసింది.

2014 డిసెంబర్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘లింగా’. ఆ సినిమా మీద డిస్ట్రిబ్యూటర్లు భారీగా పెట్టుబడి పెట్టారు. కానీ సినిమా అంచనాల్ని అందుకోలేకపోవడంతో దారుణంగా నష్టపోయారు. తమకు పరిహారం చెల్లించాలంటూ డిస్ట్రిబ్యూటర్లు అనేకరకాలుగా ఆందోళన చేశారు. ధర్నాలు చేశారు. నిరాహార దీక్షలకు దిగారు. రజినీకాంత్ ఇంటిముందు భిక్షాటన కూడా చేశారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ సెటిల్మెంట్ కు ముందుకొచ్చాడు కానీ.. అప్పుడిచ్చిన హామీ ప్రకారం డిస్ట్రిబ్యూటర్లకు చెల్లింపు చేయకపోవడంతో ‘కబాలి’ విడుదలకు ముందు డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయించారు.