Begin typing your search above and press return to search.

బూతు కేరాఫ్ సౌత్ సినిమా

By:  Tupaki Desk   |   17 March 2019 4:15 AM GMT
బూతు కేరాఫ్ సౌత్ సినిమా
X
తెలుగు సినిమా మ‌రీ ఇంత బూతు అయిపోతుంద‌నుకోలేదు.. వ‌ల్గారిటీకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోతోంది. సీబీఎఫ్‌సీ స‌ర్టిఫికేష‌న్ పేరుతో లేదా సెన్సార్ నిబంధ‌న‌లు పేరుతో వివాదాలు ముసురుకుంటున్నా ఇప్ప‌టికీ హుందాత‌నం అన్న‌ది మన మేక‌ర్స్ లో క‌నిపించ‌నేలేదన్న విమ‌ర్శ‌లు వేడెక్కిస్తున్నాయి. ధ‌నార్జ‌నే ధ్యేయంగా క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ప‌లువురు ఫిలింమేక‌ర్స్ బ‌రితెగించ‌డంపై చ‌ర్చ సాగుతోంది. బూతు క‌థ‌ల్ని ఎంచుకోవ‌డం అందుకు త‌గ్గ‌ట్టే బూతు టైటిల్స్ తో టీనేజ‌ర్ల‌ను, యూత్ ని ఆక‌ర్షించే ప్రయ‌త్నం చేయ‌డం చూస్తుంటే ఇది జుగుప్స క‌లిగించేంత దారుణం అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఓవైపు సెన్సార్ బోర్డ్ ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ప‌దే ప‌దే ఈ త‌ర‌హా రిపీట్ అవుతుండ‌డం విస్మ‌యం క‌లిగించ‌క మాన‌దు.

ఇది ఏ గ్రేడ్ సినిమా అని స్టాంప్ వేయించుకుని మ‌రీ సినిమాలు తీస్తుండ‌డం మ‌రో కొత్త ప‌రిణామం. టీజ‌ర్లు, ట్రైల‌ర్లు పేరుతో యూట్యూబ్, సామాజిక మాధ్య‌మాల్లో చేస్తున్న ఈ విశృంఖ‌ల ప్ర‌చారం వ‌ల్ల స్కూల్, కాలేజ్ యువ‌త‌ చెడిపోతుంద‌న్న ఆందోళ‌న పేరెంట్ లో క‌నిపిస్తోంది. నేరుగా తెలుగు ఫిలింమేక‌ర్స్ ఇలా బ‌రి తెగించేస్తుంటే దీనిని ఆపేదెలా? అని బుర్ర‌లు ప‌ట్టుకుంటున్న స‌న్నివేశం త‌ల్లిదండ్రుల్లో నెల‌కొంది.

మ‌న తెలుగు సినిమాలు బాలీవుడ్, హాలీవుడ్ నే కొట్టేస్తున్నాయి. ఇటీవ‌లే రిలీజైన ఏడు చేప‌ల క‌థ‌, చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు, 90ఎంఎంల్ వంటి సినిమాల టీజ‌ర్లు, వీడియోలు వీక్షించిన‌ప్పుడు ఈ బూతుకు అడ్డుక‌ట్ట వేయ‌లేమా? అంటూ మీడియా లైవ్ ల‌లోనూ వేడెక్కించే డిబేట్ న‌డిచింది. అయితే ఎవ‌రికి వారే య‌మునా తీరే! అన్న చందంగా ఓవైపు విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ఎవ‌రి ప‌నిలో వాళ్లు ఉన్నారు. తాజాగా చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు కొత్త టీజ‌ర్ రిలీజైంది. ఈ టీజ‌ర్ లో ఫ‌క్తు బూతు ద్వంద్వార్థ‌ డైలాగులతో వ‌ల్గారిటీ షాక్ కి గురి చేస్తోంది. ఇక 90 ఎంఎల్ సినిమాలో ఓవియా ఓవరాక్ష‌న్ .. న్యూడిటీ.. యువ‌త‌రంలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఈరోజుల్లో లాంటి బూతు సినిమా తీసినందుకు మారుతిని విమ‌ర్శ‌కులు తీవ్రంగా విమ‌ర్శించారు. ఆ త‌ర్వాత మారుతిలో మార్పు గురించి తెలిసిందే. ఇప్పుడు లేటుగా వెళ్లినా వీళ్లంతా మారుతినే ఫాలో అవుతున్నారు. అయితే ఇదంతా స‌క్సెస్ కోసం అనుస‌రిస్తున్న ఎత్తుగ‌డ అనుకోవాలా? అందుకోసం ద్వంద్వార్థ సంభాష‌ణ‌లు .. ఓన్లీ ఏ స‌ర్టిఫికెట్ బూతు సినిమాల్నే తీయాలా?