Begin typing your search above and press return to search.

థియేటర్లో ఉచిత ప్రదర్శన - ఒక్క ప్రేక్షకుడు కూడా రాలేదు

By:  Tupaki Desk   |   17 March 2020 11:15 AM GMT
థియేటర్లో ఉచిత ప్రదర్శన - ఒక్క ప్రేక్షకుడు కూడా రాలేదు
X
కరోనా ప్రభావం జనాలపైనే కాక సినిమాలపై కూడా పడిందనే విషయం అందరికి తెలిసిందే. కరోనా దెబ్బతో దేశ వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలతో పాటు సినిమా థియేటర్లను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రజలు కనీసం ఇంట్లో నుండి బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. కరోనా ఎఫెక్ట్ మన దేశ సినీ ఇండస్ట్రీ మీద మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల ఇండస్ట్రీల మీద కూడా పడింది. హాలీవుడ్, బాలీవుడ్ మరియు ప్రాంతీయ చిత్ర పరిశ్రమల నుండి వచ్చే ప్రధాన సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా కరోనా సృష్టించిన భయాందోళనల నుండి బయటపడి ప్రజలు ఎలా తిరుగుతారో చూడాలని చైనా తన మొదటి థియేటర్ తెరవడానికి ప్రయత్నించింది. చైనాలోని ది జాంగింగ్ గోల్డెన్ పామ్ సినిమా ప్రేక్షకుల కోసం ఉచిత ప్రదర్శన ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ కేసులు గత 27 రోజుల నుండి నమోదు కాక పోవడంతో ప్రేక్షకులను ఆకర్షించడానికి థియేటర్ తెరిచారు. ఒక్కడంటే ఒక్క ప్రేక్షకుడు కూడా స్క్రీనింగ్ కోసం హాజరు కాకపోవడం చైనా చిత్ర పరిశ్రమకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

చైనాలోనే కాదు, అమెరికా వంటి అగ్రదేశాలల్లో కూడా థియేటర్లు ఒక వారం పాటు మూసివేయబడ్డాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ భారీ నష్టాలను చవి చూస్తోంది. కరోనా ఎఫెక్ట్ పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోబడుతుందని ఆయా దేశాల చిత్ర పరిశ్రమలు ప్రకటించాయి.