Begin typing your search above and press return to search.

చిన్మయి పోస్ట్ ఎవరి గురించి అయ్యుంటుంది..??

By:  Tupaki Desk   |   28 Sep 2021 10:35 AM GMT
చిన్మయి పోస్ట్ ఎవరి గురించి అయ్యుంటుంది..??
X
సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కోంటున్న లైంగిక వేదింఫుల గురించి.. సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలపై సింగర్ చిన్మయి నిర్భయంగా స్పందిస్తుంటుందనే సంగతి తెలిసిందే. ఎన్ని ట్రోల్స్ వచ్చినా మహిళలపై జరుగుతున్న దాడులపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటుంది. మీటూ ఉద్యమం సమయంలో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పి.. ఇండస్ట్రీలో తమకు జరుగుతున్న అన్యాయాల గురించి మహిళలు బయట ప్రపంచానికి ధైర్యంగా చెప్పుకొనేలా చేసింది చిన్మయి.

తాజాగా చిన్మయి తన ఇన్‏స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈసారి 'పెళ్లైన హీరోయిన్లు సినిమాల్లో నటించడం' అనే అంశం మీద గాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ''నా బంధువు ఒకరు.. వివాహం అనంతరం హీరోయిన్లు ఎందుకు సినిమాలు చేయకూడదో అని ఈరోజు వివరించాడు. ఆయన ఒక దర్శకుడు. నా కుటుంబంలోని వ్యక్తులకే నచ్చజెప్పడం నిస్సహాయంగా భావిస్తున్నా. లింగ సమానత్వం గురించి ఎన్నో ఆర్టికల్స్ చదివాను. నేనే వాటి గురించి ఎక్కువ చర్చిస్తూ ఉంటా. అలాంటిది ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఎందుకంటే.. ఆయన చేసే వ్యాఖ్యలు విన్నప్పుడు నాలో వచ్చే మొదటి రియాక్షన్ కోపమే. ఆ కోపంలో ఏదేదో మాట్లాడేస్తామోనని భయం. మళ్లీ దాని గురించి తర్వాత పశ్చాత్తాపడటం జరుగుతుంది. అంతే కాదు వాళ్ళు చాలా తేలికగ్గా నాపై 'ఫెమినిస్ట్ బ్యాచ్' అనే కామెంట్స్ చేస్తారు'' అని చిన్మయి పేర్కొంది.

''పెళ్లైన తర్వాత ఒక మహిళ హీరోయిన్ ‏గా నటించకూడదనేది ఒక విషపూరిత పితృస్వామ్య మనస్తత్వం. సాధారణంగా ఒక అమ్మాయి తాను కన్న కలలు - భవిష్యత్తు - డబ్బు - నిర్ణయాలే కాదు.. ఆమె శరీరం - గర్భాశయం కూడా పురుషుడికే సొంతమనే దారుణమైన మనస్తత్వంలో నుంచి ఇదంతా వచ్చింది. పెళ్లి తర్వాత ఒక పురుషుడు నటించొచ్చు కానీ ఓ స్త్రీ నటించకూడదనే ఆలోచనలకు సరైన కారణమేమిటో ఆలోచించండి. సినీ ప్రపంచంలో దీపికా పదుకొణె - సమంత.. అలాగే ఇజ్రాయెల్ నటి, ముగ్గురు పిల్లలకు ట్తల్లి అయిన గాల్ గాల్ గాడోట్తో పాటు మరెందరో మైలురాయి తరువాత మైలురాయిని సాధించి భారీ అడ్డుకట్టలను తొలగించారు. వాస్తవానికి 1950, 1960ల్లో ఇలాంటి ఆలోచనలు లేవు. అందుకు నిదర్శనం అలనాటి మహానటి సావిత్రి. పెళ్లైయాక కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. ఒక మగాడి కెరీర్ లో పెళ్లి అనేది ఎలాంటి ప్రభావం చూపకపోతే మహిళకు కూడా అదే వర్తించాలి. కచ్చితంగా నేను గర్వంగా చెప్పుకుంటా నేను 'ఫెమినిస్ట్ బ్యాచ్'' అని చిన్మయి సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. అయితే సమంత ఆత్మగా పిలవబడే చిన్మయి.. ఇప్పుడు ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందో అని నెటిజన్స్ డిస్కషన్ చేస్తున్నారు.

ఇకపోతే చిన్మయి హీరో కమ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుగా సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి.. ఇప్పుడు నటిగా వెండితెర మీదకు వస్తోంది. అఖిల్ అక్కినేని - బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' చిత్రంలో ఈమె కీలక పాత్ర పోషించింది. ఇటీవలే మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. అల్లు అర్జున్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటి వరకు తన గాత్రంతో శ్రోతలను మాయ చేసిన చిన్మయి.. ఇప్పుడు స్క్రీన్ మీద ఎలా నటించిందో తెలియాలంటే దసరా పండుగ వరకు ఆగాల్సిందే.