Begin typing your search above and press return to search.

'చిన్ని' టీజర్: పగా ప్రతీకారాలతో రగిలిపోతున్న కీర్తి సురేశ్..!

By:  Tupaki Desk   |   22 April 2022 8:30 AM GMT
చిన్ని టీజర్: పగా ప్రతీకారాలతో రగిలిపోతున్న కీర్తి సురేశ్..!
X
దక్షిణాది అగ్ర కథానాయిక కీర్తి సురేష్ గత కొంతకాలంగా వరుస పరాజయాలు చవిచూస్తోంది. భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా మిగిలిపోతున్నాయి. ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న మహానటి.. 'సాని కాయిదమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

''సాని కాయిదమ్'' చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తి సురేష్ తో పాటుగా విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకుంది. కీర్తి - సెల్వరాఘవన్ ఇద్దరూ డీ గ్లామరైజ్డ్ లుక్ లో చేతిలో కత్తులు - తుపాకులు పట్టుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.

అయితే 'సాని కాయిదమ్' సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 6వ ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులో ''చిన్ని'' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు.

తాజాగా 'చిన్ని' టీజర్ ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిన్ని అనే మహిళ తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? దీనికి ఆమె సవతి సోదరుడు ఏవిధంగా తోడుగా నిలిచాడు? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెలుస్తోంది.

''ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటి? ఎవరైనా మన మీద రాయి విసిరితే.. మనమూ తిరిగి విసరాలి. మన మీద ఉమ్మేస్తే.. మనమూ ఉమ్మేయాలి. మనల్ని కొడితే మనమూ కొట్టాలి. కొందరు మన కలల్ని కల్లలు చేశారు. మన జీవితాల్ని నాశనం చేశారు. మన చిన్న ప్రపంచాన్ని అంతం చేశారు. అలాంటి వాళ్ళను జైల్లో పెడితే చాలా? పగ తీర్చుకున్నట్లు అవుతుందా?" అంటూ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది.

కథ విషయానికొస్తే.. చిన్ని కానిస్టేబుల్ గా పనిచేస్తూ, రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తున్న తన భర్త మరియు ఐదేళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తూ ఉంటుంది. అయితే స్థానిక రాజకీయ నాయకులు - అగ్ర కులాలకు చెందిన వ్యక్తుల ప్రమేయంతో వారి జీవితం చిన్నాభిన్నం అవుతుంది. చిన్ని పై అత్యాచారం చేయడమే కాదు.. ఆమె భర్తను కుమార్తెను వారి గుడిసెలోనే సజీవ దహనం చేసి దారుణంగా హత్య చేస్తారు.

చిన్ని తన సవతి సోదరుడు (సెల్వరాఘవన్)తో కలిసి న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కినా.. ఆమెకు నిరాశే ఎదురవుతుంది. దీంతో ఆవేశానికి లోనైన అన్నా చెల్లెలు ఇద్దరూ తమకు అన్యాయం చేసిన వ్యక్తులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు అనే ''చిన్ని'' సినిమా కథాంశంగా పేర్కొనబడింది.

ఇందులో కీర్తి సురేష్ - సెల్వరాఘవన్ ఇద్దరూ అద్భుతమైన నటన కనబరిచారు. కీర్తి కెరీర్ లో ఇది ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతోందనిపిస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.

గతంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'పెంగ్విన్' 'మిస్ ఇండియా' వంటి రెండు సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేరుగా అమెజాన్ ప్రైమ్ లోకి రాబోతున్న ''చిన్ని'' సినిమా ఎలాంటి ప్రేక్షదారణ దక్కించుకుంటుందో చూడాలి.