Begin typing your search above and press return to search.

నటుడిగా మీ అందరి ముందుకు వచ్చిన రోజు ఇది: మెగాస్టార్

By:  Tupaki Desk   |   22 Sept 2021 4:00 PM IST
నటుడిగా మీ అందరి ముందుకు వచ్చిన రోజు ఇది: మెగాస్టార్
X
జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదగాలనే కోరుకుంటారు .. ఆ దిశగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు. అయితే అంకితభావంతో అహర్నిశలు కృషి చేసినవారు గెలుస్తారు .. తలపెట్టిన కార్యాన్ని తపస్సులా చేసేవారు విజేతలుగా నిలుస్తారు. అలాంటివారి జాబితాలో చిరంజీవి ఒకరుగా కనిపిస్తారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేదు .. ఆదరించేవారు లేరు .. ఆశ్రయం కల్పించేవారు లేరు. ఉన్నదల్లా ఆశయం ఒక్కటే .. ఎలాగైనా దానిని సాధించాలనే పట్టుదలే. ఏ మార్గంలో వెళ్లాలి? అనే విషయంలో సలహాలు .. సూచనలు ఇచ్చేవారు లేరు. అయినా ఆత్మవిశ్వాసంతో చిరంజీవి ముందడుగు వేశారు.

కెరియర్ ఆరంభంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తూ, ఆ తరువాత హీరోగా ఆయన కుదురుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు వంటి హేమాహేమీలు బరిలో ఉన్నారు. వాళ్ల ధాటిని తట్టుకుని నిలబడటం అంత తేలికైన విషయమేం కాదు. వాళ్లందరి స్టైల్ ను పరిశీలించిన చిరంజీవి, డాన్సులతో .. ఫైట్స్ లలో కొత్త మార్పును తీసుకొచ్చారు. యాక్షన్ సీన్స్ లో అప్పటివరకూ ఆ స్థాయిలో విజృంభించినవారు లేరు. ఇక డాన్సుల పరంగా కొత్త స్టెప్పులతో చెలరేగిపోయినవారు లేరు. అలా తన కెరియర్ కి బలమైన పునాదులు వేస్తూ ఆయన ముందుకు కదిలారు.

ఎలాగో సీనియర్ హీరోలకు భిన్నమైన దారిలో వెళ్లి తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్నాడని అనుకుంటే, బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ ముగ్గురూ కూడా బలమైన వారసత్వంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఇక వాళ్ల దూకుడును తట్టుకుని నిలబడటం ఆయనకి మరో పరీక్షగా మారింది. అయినా తడబడకుండా తన టాలెంటును మాత్రమే నమ్ముకుని ఆయన ముందుకు వెళ్లారు. మధ్య మధ్యలో అపజయాల రూపంలో ఆటుపోట్లు ఎదురైనా వాటిని అధిగమించారు.

రజనీ .. కమల్ ఇద్దరూ ఎంతో ప్రతిభావంతులు. రజనీలోని స్టైల్ ను .. కమల్ లోని నటనను నేను చిరంజీవిలో చూశాను అని ఒకానొక సందర్భంలో బాలచందర్ అన్నారు. చిరంజీవి గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి ఈ ఈ ఒక్క మాట చాలు. ఈ రోజు నటుడిగా ఆయన పుట్టినరోజు .. అంటే 'ప్రాణం ఖరీదు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోజు. " 22 ఆగస్టు నేను పుట్టినరోజైతే .. 22 సెప్టెంబర్ నటుడిగా నేను పుట్టినరోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికీ నటుడిగా పరిచయమై మీ ఆశీస్సులు పొందిన రోజు .. నేను మరిచిపోలేని రోజు" అంటూ చిరంజీవి ట్విట్టర్లో రాసుచ్చారు. స్వయంకృషితో ఎవరూ అడ్డుకోలేనంత .. అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిన మెగాస్టార్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం.