Begin typing your search above and press return to search.

జనానికి మనం లోకువై పోకూడదు .. మీడియా వాళ్లకి ఆహారమై పోకూడదు: చిరంజీవి

By:  Tupaki Desk   |   11 Oct 2021 2:49 AM GMT
జనానికి మనం లోకువై పోకూడదు .. మీడియా వాళ్లకి ఆహారమై పోకూడదు: చిరంజీవి
X
రోషన్ - శ్రీలీల జంటగా గౌరీ రోణంకి దర్శకత్వంలో 'పెళ్లి సందD' సినిమా రూపొందింది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్కే అసోసియేట్ - ఆర్కా మీడియా వర్క్స్ వారు నిర్మించిన ఈ సినిమా, నిన్న రాత్రి హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు చిరంజీవి - వెంకటేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అశ్వనీదత్ .. అల్లు అరవింద్ తో పాటు, శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'పెళ్లి సందడి'లో ఒక కథానాయికగా చేసిన దీప్తి భట్నాగర్ .. మరో కథానాయికగా చేసిన రవళి గౌరవ అతిథులుగా వచ్చారు.

ఈ వేదికపై చిరంజీవి ఈ సినిమాకి సంబంధించిన విషయాలను .. విశేషాలను గురించి మాట్లాడారు. రాఘవేందర్రావు దర్శస్క ప్రతిభను గురించి .. ఆయన మంచి మనసును గురించి ప్రశంసిస్తూ మాట్లాడాడు. ఆయన మనసు '16 ఏళ్ల వయసు' సినిమా దగ్గరే ఆగిపోయింది. ఆయన మనసును 'ఎక్స్ రే' తీస్తే దాని వయసు 16 ఏళ్లు మాత్రమే ఉంటుంది అంటూ నవ్వులు పూయించారు. ఆయన మనసు .. ఆయన నవ్వు ఎప్పుడూ అలా ఆహ్లాదంగానే ఉండాలని అన్నారు.

తనని చిరంజీవిగారు అనొద్దనీ .. ఎప్పటిలా పెదనాన్న అనే పిలవమని రోషన్ ను హత్తుకున్నారు. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ 'పెళ్లి సందD' శ్రీకాంత్ 'పెళ్లిసందడి'లానే సందడి చేస్తుందని భావిస్తున్నానని అన్నారు. ఆ తరువాత శ్రీలీల లుక్ చాలా బ్యూటిఫుల్ గా ఉందంటూ మెచ్చుకున్నారు. ఆ తరువాత మరో ముఖ్య అతిగా వచ్చిన వెంకటేశ్ ను గురించి ప్రస్తావించారు.

"వెంకటేశ్ నా చిరకాల మిత్రుడు .. మా ఇద్దరికీ ఒకరంటే ఒకటికి ఎంతో అభిమానం. తన సినిమాలు ఏవి బాగున్నా వెంటనే ఫోన్ చేస్తాను. 'వెంకీ చింపేశావయ్యా .. ఎంత బాగా చేశావ్' అంటాను.

'నారప్ప'లో కేరక్టర్ తప్ప వెంకటేశ్ కనిపించలేదు. అలాగే నా 'సైరా' నచ్చినప్పుడు ఆయన నేరుగా వచ్చి మరీ నన్ను కలిసి అభినందించాడు. అందరి హీరోల మధ్య ఈ రకమైన వాతావరణం ఉంటే, ఈ పరిశ్రమలో ఈ రకమైన వివాదాలు .. మాటలు అనడం .. మాటలు అనిపించుకోవడం ఉండదు కదా. పదవుల్లాంటివి .. చిన్న చిన్న బాధ్యతల్లాంటివి ఎన్నాళ్లుంటాయి? అలాంటి వాటి కోసం మాటలు అనడం .. అనిపించుకోవడం చూస్తుంటే, బయటవాళ్లకి ఎంత లోకువైపోతామో ఆలోచించండి. ఒక పదవి కోసం అంత లోకువ కావాలా? నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది.

ఈ విషయంలో నేను ఏ ఒక్కరినీ వేలు పెట్టి చూపించడం లేదు. విజ్ఞతతో .. మెచ్యురిటీతో ప్రతి ఒక్కరూ ఉండాలి. మన ఆధిపత్యాన్ని చూపించడం కోసం అవతలివారిని కించపరచవలసిన అవసరం లేదు. ఎవరి మూలంగా ఈ మధ్య కాలంలో వివాదాలు మొదలయ్యాయి ఆ మనిషి ఎవరు? దీనంతటికి కారకులు ఎవరు? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అలాంటి వ్యక్తులను మనం దూరంగా ఉంచగలిగితే మనది వసుధైక కుటుంబం అవుతుంది. ఈ రోజున మేమంతా ఎలా ఉన్నామో అలాగే అంతా ఆప్యాయంగా ఉండాలి .. ఆత్మీయంగా ఉండాలి .. హాయిగా ఉండాలి. చిన్న చిన్న గొడవలతో అవతల వాళ్లకి లోకువైపోకూడదు .. ముఖ్యంగా మీడియావాళ్లకి ఆహారమై పోకూడదు" అంటూ ముగించారు.