Begin typing your search above and press return to search.

సంక్రాంతి బొనాంజాను ఆస్వాదించడం పోయి..

By:  Tupaki Desk   |   18 Jan 2017 10:55 AM GMT
సంక్రాంతి బొనాంజాను ఆస్వాదించడం పోయి..
X
నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవంలో పాల్గొనడమే కాదు.. ఆ సినిమా బాగా ఆడాలంటూ తన సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో లక్షల మంది అభిమానుల ముందు ఆకాంక్షించాడు చిరంజీవి. మరోవైపు బాలయ్య కూడా చిరు సినిమా బాగా ఆడాలని కోరుకున్నాడు. వాళ్లిద్దరూ అంత హుందాగా ఒకరి సినిమాల గురించి ఒకరు సానుకుూలంగా మాట్లాడితే.. వారి అభిమానులుగా చెప్పుకుంటున్న వాళ్లు మాత్రం పరస్పర ధ్వేష భావంతో రగిలిపోతుండటమే విడ్డూరం. తమ హీరో సినిమా బాగా ఆడుతున్నందుకు సంతోషించడం పోయి.. అవతలి హీరో సినిమా బాగా ఆడేస్తుండటంపై ఫీలైపోతున్నారు. అవతలి వాళ్లపై విషం చిమ్ముతున్నారు.

ఓ పక్క చిరు అభిమానులేమో.. తమ హీరో కలెక్షన్లు ముందు అవతలి బాలయ్య సినిమా వసూళ్లు చాలా తక్కువంటూ ఎద్దేవా చేస్తున్నారు. కలెక్షన్ల లెక్కలు పోల్చి చూపిస్తూ అవతలి హీరోను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బాలయ్య అభిమానులేమో.. కంటెంట్ విషయంలో తమ హీరో సినిమా ఎక్కడో ఉంటుందని.. చిరు సినిమా వేస్ట్ అని తీసి పడేస్తున్నారు. రెండు సినిమాల రేటింగుని పోల్చి చూపిస్తూ తమ హీరో గొప్పదనాన్ని చాటే ప్రయత్నం చేస్తున్నారు. తమ హీరో సినిమానే బయ్యర్లకు ఎక్కువ లాభాలిస్తోందంటున్నారు. కలెక్షన్ల విషయంలో మీరు ఫేక్ అంటే మీరు ఫేక్ అంటూ పెద్ద వారే నడుస్తోంది సోషల్ మీడియాలో. నిజానికి ‘ఖైదీ నెంబర్ 150’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రెండూ కూడా అంచనాలకు తగ్గట్లే బాగా ఆడుతున్నాయి. దేని స్థాయిలో అది చాలా మంచి ఫలితాల్నే అందుకున్నాయి. మరోవైపు ఈ రెండు పెద్ద సినిమాల మధ్య వచ్చిన ‘శతమానం భవతి’ కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. ఇలా ఒకేసారి మూడు సినిమాలు విజయం సాధించి.. ఈ ఏడాదికి అద్భుత ఆరంభాన్నిచ్చినందుకు అందరూ సంతోషించాలి. ఈ సంక్రాంతి బొనాంజాను ఆస్వాదించాలి. అది పోయి ఊరికే అవతలి వాళ్లపై విషం చల్లడం వల్ల సాధించేదేంటి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/