Begin typing your search above and press return to search.

న‌ట‌సార్వ‌భౌముని క‌లిసి చిరు-సురేఖ ఏం మాట్లాడారు?

By:  Tupaki Desk   |   25 July 2021 6:30 AM GMT
న‌ట‌సార్వ‌భౌముని క‌లిసి చిరు-సురేఖ ఏం మాట్లాడారు?
X
మెగాస్టార్ చిరంజీవి - న‌వ‌ర‌స‌ న‌ట‌నా సార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ మ‌ధ్య అనుబంధం గురించి తెలిసిన‌దే. ఆ ఇద్ద‌రూ ఎన్నో క్లాసిక్ హిట్స్ లో క‌లిసి న‌టించారు. య‌ముడికి మొగుడు- మెకానిక్ అల్లుడు- కొద‌మ సింహం- గ్యాంగ్ లీడ‌ర్- ఘ‌రానా మొగుడు- ఖైదీనంబ‌ర్ 786, .. ఇలా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో క‌లిసి న‌టించారు. చిరంజీవి క‌థానాయకుడిగా కైకాల నిర్మాత‌గా కొన్ని సినిమాలు తెర‌కెక్కాయి. త‌న కెరీర్ ఆద్యంతం మెగాస్టార్ చిరంజీవితో జ‌ర్నీ సాగించాన‌ని వారికి తానంటే ఎంతో అభిమాన‌మ‌ని కైకాల చెబుతారు.

ఇక కైకాల స‌త్య‌నారాయ‌ణ అంటే తండ్రి స‌మానులుగా గౌర‌విస్తారు మెగాస్టార్ చిరంజీవి. నేడు (25 జూలై) కైకాల 86వ‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంప‌తులు జూబ్లీహిల్స్ లోని అత‌డి ఇంటికి వెళ్లి పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. కైకాల‌తో చాలా సేపు ముచ్చ‌ట్లాడారు. త‌మ కెరీర్ జ‌ర్నీలో ఎన్నో మెమ‌రీస్ ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

కైకాల ప్ర‌స్తుతం త‌న విశ్రాంత స‌మ‌యాన్ని ఇంట్లోనే గ‌డుపుతున్నారు. ఆయ‌న జూబ్లీహిల్స్ లోని జ‌ర్న‌లిస్ట్ కాల‌నీలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఇటీవ‌ల కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 కి ఆయ‌న స‌మ‌ర్ప‌కులుగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిష్ఠాత్మ‌క హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌కులుగా కొన‌సాగారు. తెలుగులోనూ కేజీఎఫ్ విజ‌యం సాధించింది. త్వ‌ర‌లోనే సీక్వెల్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిన‌దే.

తెలుగు సినిమాతో స‌మాంత‌ర ప్ర‌యాణం:

కైకాల స‌త్య‌నారాయ‌ణ తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళ‌కు పుట్టారు. తెలుగు సినిమాతో స‌మాంత‌రంగా ఎదిగారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా `భ‌క్త‌ప్ర‌హ్లాద‌` విడుద‌ల అయితే.. 1935 జులై 25న స‌త్య‌నారాయ‌ణ జ‌న్మించారు. న‌టుడుగా ష‌ష్ఠిపూర్తి చేసుకున్నారు. 1959లో `సిపాయి కూతురు` అనే చిత్రంలో న‌టించారు.

కైకాల 777 సినిమాల్లో ఇప్పటివ‌ర‌కూ న‌టించ‌గా అందులో 28 పౌరాణిక చిత్రాలు.. 51 జానపద చిత్రాలు.. 9 చారిత్రక చిత్రాలు.. ఉన్నాయి. 200 మంది దర్శకులతో పనిచేయ‌గా.. 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవి ఉన్నాయి.

ఆయ‌న హీరోగా సినిమా రంగానికి ప‌రిచ‌యం అయినా.. ఆ సినిమా నిరాశ‌ప‌ర్చ‌డంతో విల‌న్ గా మార‌డానికి త‌ట‌ప‌టాయించ‌లేదు. జాన‌ప‌ద బ్ర‌హ్మ విఠ‌లాచార్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎన్నెన్నో జాన‌ప‌ద చిత్రాల్లో స‌త్య‌నారాయ‌ణ విల‌న్ పాత్ర‌లు పోషించారు. ఆ త‌ర్వాత సోష‌ల్ పిక్చ‌ర్స్ లో కూడా విల‌న్ పాత్ర‌లు వ‌చ్చాయి. స‌త్య‌నారాయ‌ణ న‌వ్వు పాపుల‌ర్ విల‌నీ ట్రేడ్ మార్క్ అయింది. కెరీర్ తొలిద‌శ‌లోనే ఆయ‌న‌కి పౌరాణిక పాత్ర‌ల్లో అవ‌కాశం ద‌క్కింది.

ల‌వ‌కుశ‌లో భ‌ర‌తుడిగా..శ్రీకృష్ణార్జున యుద్ధంలో క‌ర్ణుడిగా.. న‌ర్త‌న‌శాల‌లో దుశ్శాస‌నుడిగా న‌టించారు. శ్రీ కృష్ణ‌పాండ‌వీయంలో ఘ‌టోత్క‌చుడి పాత్ర తొలిసారి ధ‌రిస్తే మ‌ళ్ళీ 1995లో ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఘ‌టోత్క‌చుడు చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించారు. శ్రీకృష్ణావ‌తారం చిత్రంలో తొలిసారి దుర్యోధ‌నుడి పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత కురుక్షేత్రంలో దుర్యోధ‌నుడిగా అద్భుతంగా ర‌క్తి క‌ట్టించారు. అలాగే రావ‌ణాసురుడిగా సీతాక‌ళ్యాణంలో భీముడిగా దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌లో మూషికాసురుడిగా శ్రీ వినాయ‌క విజ‌యం చిత్రాల్లో న‌టించారు.

`మొల్ల‌` చిత్రంలో శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు పాత్రను స‌త్య‌నారాయ‌ణ‌ పోషించారు. య‌మ‌ధ‌ర్మ‌రాజు అంటే తెలుగు తెర‌కి స‌త్య‌నారాయ‌ణ త‌ప్ప మ‌రొక‌రు గుర్తురారు. య‌మ‌గోల సినిమాతో ప్రారంభ‌మైన ఈ పాత్ర జైత్ర‌యాత్ర య‌ముడికి మొగుడు- య‌మ‌లీల‌- రాధామాధ‌వ్‌- ద‌రువు చిత్రాల వ‌ర‌కూ సాగింది. మోస‌గాళ్ళ‌కు మోస‌గాడు- దొంగ‌ల వేట మొద‌లైన సినిమాల్లో ఆయ‌న విల‌న్ పాత్ర‌లు మ‌ర్చిపోలేనివి. ఉమ్మ‌డి కుటుంబం- దేవుడు చేసిన మ‌నుషులు- శార‌ద చిత్రాల‌తో ఆయ‌న ఇమేజ్ మారింది. సాత్విక‌మైన పాత్ర‌ల‌కు కూడా స‌త్య‌నారాయ‌ణ బెస్ట్ ఆప్ష‌న్ అయ్యారు. తాత‌.. మ‌న‌వడు- సంసారం సాగ‌రం- రామ‌య్య తండ్రి- జీవిత‌మే ఒక నాట‌క‌రంగం- దేవుడే దిగివ‌స్తే- సిరి సిరి మువ్వ- తాయార‌మ్మ- బంగార‌య్య- పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌రులు మొద‌లైన చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించి విల‌న్ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌ప‌డి.. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు అభిమాన న‌టుడ‌య్యారు.

క‌మెడియ‌న్ న‌గేష్ డైరెక్ట‌ర్ గా..స్టార్ ప్రొడ్యూస‌ర్ డి.రామానాయుడు నిర్మించిన మొర‌టోడు చిత్రంతో హీరోగా మారారు. నా పేరే భ‌గ‌వాన్‌- ముగ్గురు మూర్ఖులు- ముగ్గురు మొన‌గాళ్ళు- కాలాంత‌కులు- గ‌మ్మ‌త్తు గూఢ‌చారులు- తూర్పు ప‌డ‌మ‌ర- సావాస‌గాళ్ళు లాంటి చిత్రాల్లో హీరోతో స‌మాంత‌ర‌మైన పాత్ర‌లు పోషించారు స‌త్య‌నారాయ‌ణ‌. చాణ‌క్య చంద్ర‌గుప్త‌లో రాక్ష‌స‌ మంత్రిగా.. న భూతో న భ‌విష్య‌త్.. అన్న‌ట్లు న‌టించారు. నా పిలుపే ప్ర‌భంజ‌నంలో ముఖ్య‌మంత్రి పాత్ర‌తో విస్మ‌య‌ప‌రిచారు. ఒక‌టా.. రెండా వంద‌లాది చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు.

సుభాష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా క‌ర్మ‌లో విల‌న్ గా న‌టించారు. ఈ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర ధ‌రించారు. ఒక‌టీ.. రెండు తెలుగు డైలాగ్స్ కూడా ఆ సినిమాలో చెప్పారు స‌త్య‌నారాయ‌ణ‌. తమిళంలో రజనీకాంత్- కమల్ హాసన్ లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ- హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ నటించారు. కైకాల స‌త్య‌నారాయ‌కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మ‌డి ప్ర‌భుత్వం.. ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డ్ తో గౌర‌వించుకుంది.

ఇటీవ‌ల మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షిలోనూ కైకాల న‌టించారు. త‌ను న‌టించిన ప్ర‌తీ పాత్రా త‌న సొంత బిడ్డ‌లాగే భావించి.. వాటికి ప్రాణ ప్ర‌తిష్ట చేశారు. సినిమాకే ఆయ‌న జీవితం అంకితం. ప్ర‌స్తుతం విశ్రాంత స‌మ‌యాన్ని ఆయ‌న సినిమాలు చూస్తూ కాల‌క్షేపం చేస్తున్నార‌ని తెలుస్తోంది.