Begin typing your search above and press return to search.

జన సేన గాడ్ ఫాదర్ చిరు.. సినిమాలో పార్టీ స్మరణ

By:  Tupaki Desk   |   6 Oct 2022 12:54 AM GMT
జన సేన గాడ్ ఫాదర్ చిరు.. సినిమాలో పార్టీ స్మరణ
X
‘‘రాజకీయాలకు నేను దూరంగా ఉన్నానేమో కానీ.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు..’’ ‘‘పవన్ కల్యాణ్ నా తమ్ముడు.. భవిష్యత్ లో రాజకీయంగా అతడికి నా తోడ్పాటు ఉంటుంది’’.. ఇందులో ఒకటి గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్ అయితే.. మరోటి విడుదలకు ముందు మీడియాతో మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు. వాటిని పక్కనపెడితే మళయాళ సినిమా లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ దసరా పండుగకు విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ తర్వాత చిరుకు ఇది పెద్ద ఉపశమనమే. ఇప్పుడిక అసలు విషయానికి వస్తే గాడ్ ఫాదర్ లో పలు సీన్లు అన్యాపదేశంగా ఏపీలోని రాజకీయ పార్టీ‘‘జన సేన’’ను గుర్తుతెచ్చాయి.

పార్టీ పేరు నుంచి

గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రధారి ‘‘జన జాగృతి పార్టీ (జేజేపీ)’’ని ఏర్పాటు చేసి రాజకీయంగా ఎదుగుతాడు. ఆయన పేరు పి.కె.రామదాసు (పీకేఆర్‌). సినిమాలో అందరూ ఆయనను పీకేఆర్ అనే అంటుంటారు. ఈ పేరు పవన్ కల్యాణ్ (పీకే)ను తలపించేలా ఉండడం గమనార్హం. ఏపీలో పీకే సీఎం కావాలని ఆయన అభిమానులు ఆశపడుతుంటారు. ఈ సినిమాలో ఓ పీకేఆర్ ను అలా సీఎం స్థానంలో చూపారన్నమాట. ఇక సినిమాలోని పీకేఆర్ పాత్రధారి నిజాయతీ, నిబద్ధతకు కట్టుబడిన నేతగా కనిపిస్తారు. ఆదర్శాల గురించి.. ప్రజా క్షేమమే తన పరమోద్దేశం అనేలా ఆ పాత్రను చూపించారు. సరిగ్గా ఏపీలో పవన్ సైతం ఇవే అంశాలను ప్రస్తావిస్తుంటారు.

అన్నయ్య వెనుక ఉన్నాడంటూ

గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నయన తార నటించింది. సినిమా క్లైమాక్స్ లో చిరు సీఎం అవుతాడనుకుంటే.. ఆశ్చర్యకరంగా నయనతార పేరును చిరునే ప్రతిపాదిస్తాడు. దీన్ని లోతుగా చూస్తే ‘‘తమ్ముడి రాజకీయ ప్రయాణం వెనుక అన్నయ్య’’ఉన్నాడనేలా అనిపిస్తుంది. ఇక సినిమా ఆసాంతం చెల్లెలు నయనతార అన్నయ్య చిరంజీవిని ద్వేషిస్తుంటుంది.

అయితే, ఆయన తప్ప మరెవరూ తీర్చలేని కష్టాలు ఎదురైన సందర్భంలో చివరకు ఆమె ‘‘అన్నయ్యా’’ అంటూ చిరంజీవికి ఫోన్ చేస్తుంది. ఆ వెంటనే చిరు రంగంలోకి దిగి తనదైన శైలిలో కథను మలుపుతిప్పుతాడు. ఈ సన్నివేశం కూడా ‘‘తనవారికి’’ అవసరమైన సందర్భంలో చిరంజీవి రంగంలోకి దిగుతారు అనే సందేశం ఇస్తోంది.

ఎమ్మెల్యేలు ఏపీ సంఖ్యకు దగ్గరగా

సీఎం ఆకస్మికంగా చనిపోవడం.. ఎవరు సీఎం కావాలో తేలకపోవడం గాడ్ ఫాదర్ నేపథ్యం. ఈ క్రమంలో విలన్ సత్యదేవ్ కు, హీరో చిరంజీవికి వచ్చే సన్నివేశాలు ఎత్తుకుపైఎత్తు అనేలా సాగుతుంటాయి. సత్యదేవ్ 140 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం కావాలనుకుంటాడు. ఈ సంఖ్య ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉండడం గమనార్హం. అయితే, సినిమాలో 40 మంది చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు చూపడం వేరే విషయం. కాగా, గాడ్ ఫాదర్ ప్రచార చిత్రాల్లో చిరు పలికిన సంభాషణలు ఆకట్టుకోగా.. థియేటర్‌లో విజిల్స్‌ వేయించాయి. ఇదే సమయంలో వర్తమాన రాజకీయాలపై వేసిన సెటైర్లు బాగున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.