Begin typing your search above and press return to search.

సీఎం జగన్ కు చిరంజీవి విజ్ఞప్తి..!

By:  Tupaki Desk   |   25 Nov 2021 9:08 AM GMT
సీఎం జగన్ కు చిరంజీవి విజ్ఞప్తి..!
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏపీ సినిమా హాళ్లలో ఇకపై ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కేవలం నాలుగు షో లే నిర్వహించాల్సి ఉంటుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలూ రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అదనపు షోలకు అవకాశం లేదని స్పష్టం చేసింది. బ్లాక్ టికెట్స్ కు చెక్ పెట్టేలా సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరగనున్నాయని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై సినీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఆన్ లైన్ సినిమా టికెటింగ్ బిల్ పెట్టడాన్ని కొనియాడిన చిరంజీవి.. సినిమా టికెట్ రేట్ల విషయంలో పునరాలోచించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ పేరుతో ఒకే విధంగా పన్నులు తీసుకుంటున్నారని.. సినిమా టిక్కెట్స్ విషయంలో అలాంటి వెసులుబాటు ఉండడం సమంజసమని పేర్కొన్నారు. థియేటర్ల మనుగడ కోసం కాలానుగుణంగా టికెట్ రేట్లు ఉండే చిత్ర పరిశ్రమకు మేలు జరుగుతుందని చిరంజీవి విన్నవించారు.

చిరంజీవి ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. "పరిశ్రమ కోరిన విధం గా పారదర్శకత (transparency) కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం, తగ్గించిన టికెట్ రేట్స్ ని కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది.

దేశమంతా ఒకటే GST గా పన్నులను ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం వున్నపుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది" అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా బెనిఫిట్ షోలు సమజాహితం కోణంలో ఎవరి బెనిఫిట్ కోసం వేస్తున్నారో ప్రభుత్వానికి నివేదిస్తే అనుమతి ఇస్తారని సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని వెల్లడించారు. నాలుగు షో లకు మాత్రమే వెసులుబాటు ఉండటం వల్ల భారీ బడ్జెట్ సినిమాలకు భారీ షాక్ తగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల వలన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే అవకాశం ఉందని కొందరు విమర్శిస్తున్నారు.

ఇకపోతే ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానాన్ని చిరంజీవితో పాటుగా పలువురు నిర్మాతలు - థియేటర్ ఓనర్లు కూడా స్వాగతించారు. సినీ నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ఆన్ లైన్ లో టికెట్స్ అమ్మాలని నిర్మాతలు ఎగ్జిబిటర్లు ఎప్పటి నుంచో కోరుతున్నారని.. ఎగ్జిబిటర్ల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. వైజాగ్ జగదాంబ థియేటర్ ఓనర్ కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.