Begin typing your search above and press return to search.

చిరు ఆనందాన్ని వర్ణించగలమా!

By:  Tupaki Desk   |   31 March 2018 10:30 AM GMT
చిరు ఆనందాన్ని వర్ణించగలమా!
X
పుత్రుని నలుగురు పొగడగ సుమతి అని మహానుభావులు చెప్పిన సూక్తిని చిరంజీవి ఇప్పుడు స్వయంగా అనుభవిస్తున్నారు. మెగా వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ కమర్షియల్ గా ఎన్ని విజయాలు సాధించినా అవి అభిమానుల సపోర్ట్ తోనో లేక మాస్ ప్రేక్షకుల మెప్పుతోనో సంపాదించినవి తప్ప స్వంతంగా తన బ్రాండ్ మీదే చెర్రి ఇది నా విజయం అని గర్వంగా చెప్పుకునేది ప్రత్యేకంగా ఏది లేదన్నది నిజం. ధృవ అది నెరవేర్చే ప్రయత్నం చేసినప్పటికీ రీమేక్ మూవీ కనక అంతగా వెలుగులోకి రాలేదు. కాని రంగస్థలం ఈ లెక్కలన్నీ మార్చేసింది. సుకుమార్ దర్శకత్వం గురించి కన్నా రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించే టాక్ ఎక్కువగా ఉంది అంటే ఏ రేంజ్ లో చరణ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటున్నాడో అర్థమవుతుంది. దీనితో జాతీయ అవార్డు కొట్టేసినా ఆశ్చర్యం లేదన్న మాటలో కూడా అతిశయోక్తి లేదనిపిస్తుంది సినిమా చూసాక.

చిరంజీవిని ఇప్పుడు ఇదే ఆనందానికి గురి చేస్తోంది. కమర్షియల్ హీరోగా చిరు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్వయంకృషి, రుద్రవీణ లాంటి సినిమాలు చేసాడు. అవి ప్రశంశలతో పాటు వసూళ్లు కూడా తెచ్చినవే. కాని బాక్స్ ఆఫీస్ దగ్గర లెక్కలే విజయానికి కొలమానంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రకు ప్రాణప్రతిష్ట చేయటంతో పాటు దీని కమర్షియల్ రేంజ్ అమాంతం పెంచడం చిరు పుత్రోత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. నిన్న దీన్ని ప్రత్యేకంగా సినిమా యూనిట్ తో పాటు దర్శకులు వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగాలతో కలిసి సెలెబ్రేట్ చేసుకునే దాకా ఉండలేకపోయారు చిరు. తాను ప్రీ రిలీజ్ లో చెప్పిన మాటలు అక్షరాల నిజం కావడం పట్ల ఆయనే కాదు అభిమానులు కూడా ఆనందంలో తేలుతున్నారు.

మొదటి రోజు కలెక్షన్స్ పరంగా చరణ్ కెరీర్ లో కొత్త రికార్డు సెట్ చేసిన రంగస్థలం ఓవర్సీస్ లో సైతం అదే జోరు కొనసాగిస్తోంది. హౌస్ ఫుల్స్ తో థియేటర్ల దగ్గర మామూలు రచ్చ లేదు. అనంతపూర్ లో మొదటి రోజు ఐదు ఆటల ప్రదర్శన పూర్తయ్యాక నిన్న రాత్రి 1 గంటకు ఫాన్స్ కోసం స్పెషల్ షో వేయటం చూస్తుంటే వినపడే సౌండ్ కాదు బాక్స్ ఆఫీస్ పగిలిపోయే సౌండ్ చిట్టిబాబు వినిపించాడన్నది నిజం