Begin typing your search above and press return to search.

సీనియర్ నటి పావలా శ్యామల కు చిరంజీవి ఆర్థిక సాయం..!

By:  Tupaki Desk   |   18 May 2021 3:33 PM GMT
సీనియర్ నటి పావలా శ్యామల కు చిరంజీవి ఆర్థిక సాయం..!
X
హాస్యనటిగా దాదాపు 250కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వయసు మీదపడటంతో పాటు అనారోగ్యం సమస్యలతో సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లోని ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న శ్యామల.. ఇంటి అద్దె కట్టలేక తనకు వచ్చిన అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సమస్యలు.. తనతో పాటుగా తన కుమార్తె అనారోగ్యం పాలవ్వడం పావలా శ్యామల పరిస్థితి దారుణంగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో పావలా శ్యామల పరిస్థితిని తెలుసుకున్న చిరంజీవి ఆమెకు తనవంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో పావలా శ్యామల కుటుంబానికి ఫైనాన్షియల్ సపోర్ట్ గా చిరంజీవి లక్ష రూపాయల చెక్ ను ఆమెకు పంపించి మంచి మనసు చాటుకున్నారు. గతంలో ఒకసారి చిరు ఆమెకు రూ.2 లక్షలు సాయం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆమె ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఇటీవల ఆమెను కలిసి తన వంతు సాయాన్ని అందించారు. అలానే కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న నటుడు జీవన్ కుమార్ కూడా పావలా శ్యామల కు ఆర్థిక సహాయం అందించారు. ఇక 'సిసింద్రీ' డైరెక్టర్‌ శివ నాగేశ్వరరావ్‌ ఆమెకు 50 వేల రూపాయలను అందించి అండగా నిలిచారు.