Begin typing your search above and press return to search.

మెగా మాటలు: 150కి అదే ముఖ్యం

By:  Tupaki Desk   |   21 Aug 2015 3:52 AM GMT
మెగా మాటలు: 150కి అదే ముఖ్యం
X
నిజానికి మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా అనగానే.. ఏ దర్శకుడితో ఆయన సినిమా చేస్తారూ... రాజమౌళితోనా శేఖర్‌ కమ్ములతోనా.. పూరి జగన్‌ తోనా మాస్‌ గన్‌ వినాయక్‌ తోనా.. ఇలాంటివి అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయ్‌. కాని చిరంజీవి ఓల్డ్‌ స్కూల్‌ స్టూడియో స్టయిల్‌ మనిషి కదా.. అందుకే ఆయన హాలీవుడ్‌ రేంజులో ఆన్సర్‌ ఇచ్చారు. ఒక ప్రముఖ టివి ఛానల్‌ తో ఆయన తన 60వ పుట్టినరోజును పురస్కరించుకొని ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్యూ లో ఈ సినిమా గురించి అనేక విశేషాలు తెలియజేశారు.

''150వ సినిమా మొదలవ్వాలంటే కథ కుదరాలి. దర్శకుడిని బట్టి కథ కాదు.. కథను బట్టే దర్శకుడు. కథ సెట్టయితే, దర్శకుడు ఎవరనేది సెట్‌ చేయవచ్చు. అంతేకాని పలానా దర్శకుడు అని ఫిక్సవలేదు'' అంటూ సెలవిచ్చారు మెగాస్టార్‌. ఇంతకీ పూరి జగన్‌ తో ఎందుకు చేయట్లేదు?? ''ఆటోజానీ మెదటి భాగం కథ బాగా కుదరింది కాని, రెండో భాగం మాత్రం ఎక్సయిటింగ్‌ గా లేదు. నాకూ పూరీ కి ఆ కథ నచ్చలేదు. అందుకే దానిని హోల్డ్ లో పెట్టాం. ఒకవేళ కథ వర్కవుట్‌ అయితే ఆటో జానీతో ముందుకెళతాం'' అన్నారు. వాళ్ళూ వీళ్ళూ ఎందుకు సార్‌.. మీ 150వ సినిమాకు మీరే దర్శకత్వం వహించుకోవచ్చుగా.. ''అబ్బే అది కష్టం. నా గురించి నాకంటే ఎక్కువ నా దర్శకులకే తెలుసు. సో, వాళ్లు అది తీయడమే కరక్టు. మనమా? డైరక్షనా? అంతలేదు''. ఇకపోతే 150వ సినిమా కోసం పెద్దగా ప్రిపేర్‌ అవుతున్నట్లు లేరు, కాస్త కలర్‌ తగ్గారు.. నల్లబడ్డారు అని అడిగితే.. చిరు నవ్వులు పూయించారు.. ''మనలో మనమాట.. మనమేమన్నా పెద్ద కలరా? ఎందుకండీ ఈ కలర్‌ ఫుల్‌ డిస్కషన్లు..'' అంటూ నవ్వేశారు.

చూస్తుంటే మెగస్టార్‌ తన 150వ సినిమాను మరో రెండు నెలల్లో ఖచ్చితంగా మొదలెట్టేలానే ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాపై ప్రస్తుతం ఆయన చాలా సీరియస్‌ గా ఫోకస్‌ పెట్టేసనట్టు తెలుస్తోందిలే. డ్యాన్సు గురించి చెబుతూ.. ''మ్యూజిక్‌ విన్నా.. ఏదన్నా సాంగ్ చూసినా.. రేసుగుర్రంలో శృతి హాసన్‌ టైపులో లోలోపలే డ్యాన్సు చేసుకుంటూ ఉంటా.. అసలు డ్యాన్సు వేసి 8 సంవత్సరాలు అయినా కూడా.. ఒక్కసారి ఫ్లోర్‌ మీద అడుగుపెడితే ఆటోమ్యాటిక్‌ గా ఈ డ్యాన్సు అలా తన్నుకొస్తుంది అంతే. అది నరనరాల్లో ఉంది'' అన్నారు చిరు. అసలు ఈయన ఈ రేంజులో డ్యాన్సును ఉతికి ఆరేస్తారు అనే కదా మెగాభిమానులు కూడా సినిమాల్లోకి తిరిగి రావాలంటూ పట్టుబడుతోంది.