Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్లో మెగా సందడి!

By:  Tupaki Desk   |   1 Dec 2021 4:22 AM GMT
న్యూ ఇయర్లో మెగా సందడి!
X
చిరంజీవి సినిమా ఒకటి సెట్స్ పై ఉందంటేనే మెగా అభిమానులు చేసే సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయన నుంచి అదే ఏడాదిలో మరో సినిమా వస్తుందని తెలిస్తే ఇక వాళ్ల ఆనందానికి హద్దు ఉండదు. అలాంటిది చిరంజీవి ఎంతమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటూ వెళుతుంటే, మెగా అభిమానులు పెద్ద పండుగలన్నీ వరుసగా వస్తున్నంత ఆనందాన్ని పొందుతున్నారు. సాధారణంగా చిరంజీవి ఒక సినిమా పూర్తయ్యేవరకూ రెండో సినిమా జోలికి వెళ్లరు. అలాంటి చిరంజీవి ఈ సారి వరుస సినిమాలను లైన్లో పెట్టేశారు.

కరోనా సెకండ్ వేవ్ తరువాత ఆయన చాలా చురుకుగా వ్యవహరించారు. సమయాన్ని ఎంతమాత్రం వృథా చేయకుండా ఈ వయసులో ఆయన అన్నేసి ప్రాజెక్టులను సెట్ చేసుకోవడం యంగ్ హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇక సినిమాలను వరుసగా ఒప్పేసుకుంటూ వెళ్లడమే కాదు, ఆ ప్రాజెక్టులను ఎప్పుడు పట్టాలెక్కించాలి? ఎప్పుడు థియేటర్లకు తీసుకురావాలి? అనే విషయంలోను ఆయన పూర్తి క్లారిటీతో ఉన్నారు. కొరటాల దర్శకత్వంలో ఆయన చేసిన 'ఆచార్య' సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నారు. సంక్రాంతి తరువాత వస్తున్న పెద్ద పండుగలా అభిమానులు ఈ సినిమాను గురించి చెప్పుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం చిరంజీవి .. మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్నారు. సెట్స్ పైకి వెళ్లడానికి ముందే ఈ సినిమాకి సంబంధించిన ప్లానింగ్ పకడ్బందీగా జరిగిపోయింది. అందువలన చకచకా షూటింగును కానిచ్చేస్తున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగును పూర్తి చేయనున్నారు. నయనతార కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, వేసవిలో విడుదల చేయనున్నారు. ఇక ఆ తరువాత లైన్లోకి బాబి ప్రాజెక్టు రానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ నెలలో మొదలవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక మేజర్ షెడ్యూల్ ను ఈ నెలలో పూర్తి చేయనున్నారు.

బాబీతో చేస్తున్న సినిమాను దసరా బరిలోకి దింపాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న మాట. అంటే ఫిబ్రవరిలో 'ఆచార్య' .. ఏప్రిల్ - మే నెలలలో 'గాడ్ ఫాదర్' .. అక్టోబర్లో బాబి సినిమా విడుదలవుతాయి. వచ్చే ఏడాదిలో మెగాస్టార్ నుంచి ఈ మూడు భారీ సినిమాలు రానున్నాయి. ఇక మిగిలినదల్లా 'భోళా శంకర్' సినిమా. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆల్రెడీ మొదలైపోయింది. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కరోనా మరోసారి పంజా విసరకపోతే, ఈ సినిమాలన్నీ కూడా ముందుగా అనుకున్న ప్రకారం థియేటర్లలో దిగిపోవడం ఖాయం! బాక్సాఫీస్ ను దడదడలాడించడం ఖాయం!!