Begin typing your search above and press return to search.

‘మా’ కోసం చిరంజీవి మరో సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   1 July 2021 8:30 AM GMT
‘మా’ కోసం చిరంజీవి మరో సంచలన నిర్ణయం
X
ఎన్నికల కొట్లాటలో అసలు విషయం పక్కకు జరిగిపోతుంటుంది. గెలిచేముందు అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పే వాళ్లు గెలిచాక ఏం పట్టించుకోరు. అస్సలు అభివృద్ధి మాట వినపడదు.. కనపడదు. ఇప్పుడు రాజకీయ నేతలే కాదు.. సినీ ప్రముఖులు సైతం అలానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు’ సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు మరోసారి పాత సమస్యలన్నీ తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అనే ప్యానెల్లు గెలిచినా ‘మా’ కోసం ఒక సొంత భవనం నిర్మించలేక పోయారనే విమర్శ ఉంది. అధ్యక్ష స్థానం కోసం ప్రముఖులు పోటీపడి గెలిచినా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరగడం.. పూర్తవడం.. అలాగే పెండింగ్ లో ఉండడం సర్వసాధారణంగా ఉంది. మా కోసం సొంత భవనం మాత్రం ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది.

ఎన్నికలకు ముందు ప్రధాన అజెండా ‘మా’ కోసం దాని సొంత భవనాన్ని నిర్మించడం.. టాలీవుడ్ లో కొంత మంది ఉత్తమ నటులు ఉన్నారు. కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు.వారు తలుచుకుంటే చిటికెలో ‘మా’ భవనం నిర్మించవచ్చు. కానీ సినీ ప్రముఖుల్లో అనైక్యతే వారికి శాపంగా ఉంది.

ముందుగా మా కోసం ప్రభుత్వ భూమిని మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో సినీ ప్రముఖులు కోరుతున్నారు. కానీ సంవత్సరాలు గడిచిపోయినా అది ఎవరూ పట్టించుకోవడం లేదు. కొత్త ప్యానెళ్లు వచ్చి పోయినసారి ‘నరేశ్’ అధ్యక్షుడైనా కూడా నెరవేరలేదు. మా సొంత భవనం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నడుం బిగించాడు. ఎన్నికల తంతు ముగిసిన తర్వాత ‘మా’కోసం భూమిని కేటాయించాలని ఇతర సినీ ప్రముఖులతో కలిసి త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఒకవేళ అందుకు సిద్ధంగా లేకపోతే ప్రముఖులందరూ సమావేశమై ఒక కమిటీని ఏర్పాటు చేసి ‘మా’ భవనం నిర్మాణానికి నిధులు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రముఖ నటుడు మోహన్ బాబు ‘మా’ భూమి కొనుగోలు కోసం 25శాతం నిధులు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. మిగిలిన 75శాతం మొత్తం వసూలు చేయాలని చిరంజీవి భావిస్తున్నాడు. ఇక ఆ భూమిలో చిరంజీవి తన సొంత ఖర్చులతో ఒక భవనాన్ని నిర్మించాలని యోచిస్తున్నాడు.

చిరంజీవి కోరికమేరకు నటీనటులంతా ముందడుగు వేస్తే ‘మా’ భవన నిర్మాణం చాలా సులభం అవుతుంది. అయితే అనైక్యతకు మారుపేరైన ‘మా’లో ఇది సాధ్యం అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.