Begin typing your search above and press return to search.

సైరా టీంకి చిరు మెసేజులు

By:  Tupaki Desk   |   20 Jan 2018 4:19 AM GMT
సైరా టీంకి చిరు మెసేజులు
X
మొదలు పెట్టిన ముహూర్తంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో కాని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 151 సినిమా సైరా నరసింహారెడ్డి విషయంలో ఎదురవుతున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. వాటికి తోడు మీడియాలో సైరా గురించి వస్తున్న కథనాలు కొన్ని అభిమానులను సైతం ఆందోళనకు గురి చేసాయి - చేస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక దర్శకుడు సురేందర్ రెడ్డి పనితనం పట్ల అంతగా సంతృప్తి చెందని చిరు పాటల కోసం కృష్ణవంశిని, కీలకమైన యాక్షన్ సన్నివేశాల కోసం గుణశేఖర్ ని లైన్ లో పెట్టారని వార్తలు వచ్చాయి. గుణశేఖర్ అసలు తనకు ఫోన్ సమాచారం కూడా లేదని కుండ బద్దలు కొట్టేసాడు. నక్షత్రం తర్వాత కృష్ణవంశి తన కొత్త సినిమా పనుల్లో ఉండి బయట ఎక్కడా కనిపించడం లేదు. అది ఉట్టి పుకారే అని తేలిపోయింది.

నిజానికి వీటికి బీజం వేసింది కెమెరామెన్ మార్పు. తొలుత మోషన్ పోస్టర్ రిలీజ్ టైంలో అనౌన్స్ చేసిన రవి వర్మన్ తప్పుకోవడం ఖైది నెంబర్ 150 - రంగస్థలం సినిమాలకు పనిచేసిన రత్నవేలుని రీ ప్లేస్ చేయటంతో ఇవి మొదలయ్యాయి. దానికి తోడు డిసెంబర్ లో హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ ఇవ్వడానికి వచ్చిన ఎఆర్ రెహమాన్ తాను సైరా ప్రాజెక్ట్ చేయలేకపోతున్నట్టు మీడియాకే చెప్పడంతో వీటికి మరింత బలం వచ్చినట్టు అయ్యింది. నయనతార సైతం సుముఖంగా లేదు అనే మరో వార్త, సాయి మాధవ్ బుర్రా-పరుచూరి మధ్య ఏదో కమ్యునికేషన్ గ్యాప్ అంటూ మొత్తంగా సైరా విషయంలో జరిగిన వార్తల జాతర చిన్నదేమీ కాదు. సోషల్ మీడియాతో పాటు వెబ్ మీడియా వీటి గురించి పెద్ద చర్చే నడిచింది.

ఇంత జరిగాక చిరు దాకా వెళ్ళకుండా ఉంటుందా. సైరా విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని నిశితంగా గమనించిన మెగాస్టార్ యూనిట్ లో కూడా ఇలాంటి ప్రచారాలు వేరే సంకేతాలు ఇచ్చే అవకాశం ఉన్నాయని గుర్తించడంతో అందరికి వ్యక్తిగతంగా ఎస్ ఎంఎస్ పెట్టారట. సైరా విషయంలో వస్తున్న ఏ వార్తనైనా వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని చెబుతూ ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఇలాంటివి రావడం సహజం అంటూ వాళ్ళలో స్థైర్యం నింపే ప్రయత్నం చేసారట. యూనిట్ సభ్యుల మధ్య ఉన్న చిన్న అయోమయానికి వీటితో పూర్తిగా చెక్ పడిందని టాక్. ఎంతైనా మెగాస్టార్ కదా, సమస్యని డీల్ చేయటంలో తన అనుభవాన్ని ఋజువు చేసుకున్నారు.