Begin typing your search above and press return to search.

చిరంజీవి ఛారిటీ నుంచి `ఆక్సిజన్ బ్యాంక్`

By:  Tupaki Desk   |   20 May 2021 3:09 PM GMT
చిరంజీవి ఛారిటీ నుంచి `ఆక్సిజన్ బ్యాంక్`
X
క‌రోనా క‌ష్ట‌కాలంలో సీసీసీని ప్రారంభించి కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల్ని అందించిన మెగాస్టార్ చిరంజీవి ఆర్టిస్టుల‌ను క‌ష్టంలో ఆదుకునేందుకు ల‌క్ష‌ల్లో డొనేష‌న్లు ఇస్తున్నారు. క‌రోనా రోగుల‌కు స‌కాలంలో వైద్యం అందించేందుకు త‌న‌వంతు స‌హ‌కారం చేస్తున్నారు. ఇవేకాదు.. మరో మెగా కార్యక్రమానికి చిరంజీవి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో తాను ముందుకు వచ్చి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దీన్ని యుద్దప్రాతిపదికన పూర్తిచేయనున్నారు.

మెగాస్టార్ చాలా సంవ‌త్స‌రాలుగా సేవాకార్య‌క్ర‌మాల‌పై పూర్తిగా దృష్టి సారించారు.. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో 1998లోనే తన సేవలకు శ్రీకారం చుట్టారు. ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త ఆ సంక‌ల్పానికి కార‌ణ‌మైంది. ఓ రోగి సకాలంలో రక్తం అందక చనిపోయాడన్న వార్త చ‌దివిన మెగాస్టార్ ని అది ఎంతో కదిలించింది. మన వంతు ఇలాంటి కార్యక్రమం ఏదైనా చేస్తే ఇలాంటి మరణాలు సంభవించవు కదా అనిపించింది. వెంటనే తన ఆలోచనను అమలులో పెట్టారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆయన స్తాపించిన బ్లడ్ బ్యాంక్ ఎంద‌రినో ఆప‌ద‌లో ఆదుకుంది. ప్రాణాల్ని కాపాడింది. ఇటీవ‌ల ర‌క్త ప్లాస్మా డొనేష‌న్ పైనా చిరంజీవి త‌గు ప్ర‌చారం చేశారు. రోగుల‌కు సాయ‌మందించారు.

సెకండ్ వేవ్ లో ఊహాతీత‌మైన‌ కరోనా మరణాలు కూడా మెగాస్టార్ ను కదిలించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఆక్సిజన్ బ్యాంక్ స్థాపన ఆలోచన. తన ఆలోచనకు కుమారుడు రామ్ చరణ్ తోనూ పంచుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. అలా యుద్దప్రాతిపదికన ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటవుతోంది. వారం రోజుల్లో ఈ బ్యాంక్ తన సేవలను ప్రారంభించబోతోంది. ఆ ఆక్సిజన్ బ్యాంక్ పర్యవేక్షణ బాధ్యత అంతా రామ్ చరణ్ చూస్తారు.

మెగా అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేయబోతున్నారు. ఆయా జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులు అక్కడ వీటి నిర్వహణ బాధ్యత చూస్తారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటవుతోంది. దీని అధికారిక ప్రకటనను ట్విట్టర్ ద్వారా రామ్ చరణ్ విడుదల చేశారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. ట్విట్ట‌ర్ లో ఈ బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌కు సంబంధించిన వివ‌రాలు తెలుసుకునే వీలుంటుంది.