Begin typing your search above and press return to search.

'వీవీఆర్' కు చిరు కత్తెర వేస్తాడా?

By:  Tupaki Desk   |   15 Nov 2018 8:04 AM GMT
వీవీఆర్ కు చిరు కత్తెర వేస్తాడా?
X
రామ్ చరణ్ సినిమా అంటే అందులో చిరు ప్రమేయం లేకుండా ఉండదు. ముందు కథ ఓకే చేయాలి. తర్వాత మధ్యలో రషెస్ చూడాలి. చివరగా ఫైనల్ కట్ చూసి ఓకే చేయాలి. చరణ్ ప్రతి సినిమాకు ఎడిటింగ్ టేబుల్ దగ్గర చిరు మార్పులు చేర్పులు చేస్తాడని అంటాడు. చివరగా సినిమా నిడివి ఎంత ఉండాలన్నది చిరునే డిసైడ్ చేస్తాడని చెబుతారు. చిరును మంచి ఎడిటర్ గా చెప్పుకుంటారు సినీ జనాలు. ఐతే ఒక్క ‘రంగస్థలం’ విషయంలో మాత్రం చిరు ఎడిటింగ్ టాలెంట్ చూపించలేకపోయాడు. దాదాపుగా సుకుమార్ తీసిన మొత్తం సినిమాను చిరు అలాగే వదిశాడట. సినిమా మూడు గంటల నిడివితో బయటికి వచ్చిందంటేనే చిరు పెద్దగా జోక్యం చేసుకోలేదని అర్థం చేసుకోవచ్చు. ‘రంగస్థలం’ చూశాక చిరు జడ్జిమెంట్ కరెక్టే అని జనాలు కూడా అభిప్రాయపడ్డారు.

ఇప్పుడిక చిరు మళ్లీ కొడుకు కోసం ఎడిటర్ అవతారం ఎత్తబోతున్నాడు. చరణ్ కొత్త సినిమా ‘వినయ విదేయ రామ’ విడుదలకు ముస్తాబవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అతను 3 గంటలకు పైగా నిడివితో రఫ్ కట్ రెడీ చేశాడట. దీన్ని త్వరలోనే చిరుకు చూపించబోతున్నట్లు సమాచారం. అది చూసి చిరు మార్పులు చేర్పులు ఏం చెబుతాడా అని ఎదురు చూస్తోందట చిత్ర బృందం. ఐతే ‘రంగస్థలం’ లాగా దీన్ని మూడు గంటల నిడివితో వదిలితే కష్టమే. ఎందుకంటే ఇది బోయపాటి మార్కు సగటు మాస్ సినిమా. ఇలాంటివి అంతేసి నిడివితో ఉంటే కష్టం. ‘రంగస్థలం’ మ్యాజిక్ అన్ని సినిమాలకూ పని చేయదు. కాబట్టి కనీసం అరగంటైనా కోత తప్పదని భావిస్తున్నారు. మరి చిరు కత్తెరను ఎలా ఉపయోగిస్తాడో చూడాలి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశాల్లో పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం సన్నాహాల్లో ఉంది.