Begin typing your search above and press return to search.

తప్పు వాళ్లదా.. చిరంజీవిదా?

By:  Tupaki Desk   |   2 Oct 2015 9:00 AM GMT
తప్పు వాళ్లదా.. చిరంజీవిదా?
X
ఏళ్ల పాటు ఊరించి ఊరించి.. చివరికి ఓ రీమేక్ కు ఓటేశాడు చిరంజీవి. గత కొన్నేళ్లలో ఆయన ఎన్ని కథలు విని ఉంటాడో అంచనా వేయొచ్చు. తెలుగులో చెయ్యి తిరిగిన రచయితలు ఎంతోమంది ఉన్నారు. కొమ్ములు తిరిగిన దర్శకులూ ఉన్నారు. కానీ వాళ్లెవ్వరూ కూడా చిరంజీవి కోసం ఓ కథ తయారు చేయలేకపోవడం విడ్డూరమే. చివరికి వారంలో కథ రాసి.. స్క్రిప్టు మొత్తం వండి వార్చే యగల పూరి జగన్నాథుడు కూడా చిరంజీవిని మెప్పించలేకపోవడం విచారించాల్సిన విషయమే. చిరంజీవి తన పునరాగమనానికి ఓ రీమేక్ ఎంచుకోవడం ద్వారా సేఫ్ మూవ్ వేసి ఉండొచ్చు. ఐతే చిరు ఎలాంటి సినిమా చేస్తాడా అని ఎంతో ఎగ్జైట్ మెంట్ ఉన్న అభిమానులకు మాత్రం ఇది ఒకింత నిరాశ కలిగించేదే. చిరు క్యారెక్టర్ ఏంటి, కథేంటి అన్న విషయంలో ఎగ్జైట్ మెంట్ కు అవకాశం లేకుండా పోయిందిప్పుడు.

ఇంతకీ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఓ రీమేక్ కావడం.. డైరెక్ట్ తెలుగు సినిమా చేయలేకపోవడంలో వైఫల్యం మన రచయితలు, దర్శకులదా? లేక అది చిరంజీవి స్వీయ తప్పిదమా? అన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. నింద ఇద్దరూ పంచుకోవాల్సి ఉంటుంది. చిరంజీవి డిమాండ్లు కొంచెం అతిగానే ఉండొచ్చు. అయినప్పటికీ ఆయన డిమాండ్లకు తగ్గట్లు కథ రాసి మెప్పించాల్సింది. కానీ ఆ పని ఎవ్వరూ చేయలేకపోయారు. ఐతే ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి - యాక్షన్ ఉండాలి - ఫ్యామిలీస్ కు నచ్చాలి - కొంచెం సందేశం ఉంటే కూడా బెటర్. ఫైట్లు - పాటలు - స్టెప్పుల విషయంలో అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకూడదు.. అంటూ సవాలక్ష కండిషన్లు పెడితే కథ ఎలా రాయడం అంటూ రచయితలు - దర్శకులు చెబుతున్న అభ్యంతరాలు కూడా పట్టించుకోదగ్గవే.

అన్ని రసాలూ ఉండేలా కథ రాస్తూ అది ఆకర్షణీయంగా ఉండేలా స్క్రీన్ ప్లే సమకూర్చడమంటే మాటలు కాదు. మరీ ఇలా లెక్కలేసుకుని స్క్రిప్టు రాయడమంటే చిన్న విషయం కాదు. ఈ విషయంలో చిరంజీవి కూడా కొంచెం సర్దుకుపోవాల్సింది. చిరంజీవి 150వ సినిమాకు కథ రాయాలంటే అది 3 భజరంగి భాయిజాన్ - 3 బాహుబలి సినిమాలకు సమానంగా ఉండాలంటూ విజయేంద్ర ప్రసాద్ సెటైర్ వేసింది ఇందుకే మరి. ఏదేమైనా చిరంజీవి ఓ రీమేక్ కు ఓకే చేయడం మాత్రం కొంచెం నిరాశ పరిచే విషయమే. ఏదైతే అయింది.. చిరంజీవి రీఎంట్రీకి రెడీ అయిపోతున్నాడు కాబట్టి సంతోషిద్దాం.