Begin typing your search above and press return to search.

శరభ చూస్తే జగదేకవీరుడు గుర్తొచ్చింది

By:  Tupaki Desk   |   28 Aug 2017 6:17 AM GMT
శరభ చూస్తే జగదేకవీరుడు గుర్తొచ్చింది
X
కొత్త హీరో సినిమా అయినా.. ఇప్పుడు జనాల్లో ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయిన మూవీ శరభ. ఆకాష్ అనే కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చిరు చేతుల మీదుగా లాంఛ్ చేయించడంతో.. సడెన్ గా వార్తల్లోకి వచ్చింది. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ చూస్తుంటే.. తను నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం గుర్తు వచ్చిందని మెగాస్టార్ చెప్పడం విశేషం.

"శరభ మోషన్ పోస్టర్ లాంఛ్ చేయమని నన్ను అడిగారు. అయితే నేను బయటి ఫంక్షన్స్ కు ఈ మధ్య రావడం లేదని చెప్పాను. ఇబ్బంది లేకుండా మీ ఇంట్లోనే ఏర్పాటు చేస్తామని జయప్రద గారు చెప్పారు. ఈ సందర్భంగా నేను సినిమాలోని క్లిప్పింగ్స్ చూశాను. అప్పుడు ఇది సాధారణ చిత్రం కాదనే విషయం అర్ధమైంది. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందింది. దైవ శక్తికి దుష్టశక్తులకు మధ్య నడిచే యుద్ధాన్ని దర్శకుడు నరసింహారావు ఎంతో ప్రతిభతో తెరకెక్కించాడు. అలాగే యంగ్ఏజ్ నుంచి సీనియర్ వరకూ జయప్రద గారు చూపిన నటనా ప్రతిభ అసామాన్యం. సన్నివేశాలు చెప్పచ్చో లేదో నాకు తెలియదు. కానీ ఒక అడవిలో డెలివరీ కోసం ఆమె పడ్డ బాధ.. చూపిన నటన.. దుష్టశక్తి ఆవహించినపుడు పసి పిల్లాడిని చంపాల్సిన పరిస్థితి.. ఇదంతా చూసి నాకు ఒళ్లు గగుర్పొడించింది" అన్నారు చిరంజీవి.

కొత్త కుర్రాడు అయినా ఆకాష్ చాలా అద్భుతంగా చేశాడని.. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో నరసింహస్వామి ఆవహించినపుడు అద్భుతంగా నటించాడని అన్నారు చిరు. ఇక ఈ సినిమా దర్శకుడు నరసింహారావు చాలా తక్కువగా మాట్లాడాడని.. అది చూస్తేనే ఆయన మాటల మనిషి కాదు.. చేతల మనిషి అనే సంగతి అర్ధమవుతోందని చెప్పారు మెగాస్టార్.