Begin typing your search above and press return to search.

అతను నిర్మాతకు నిలువెత్తు నిర్వచనం: చిరు

By:  Tupaki Desk   |   28 Jan 2017 4:47 AM GMT
అతను నిర్మాతకు నిలువెత్తు నిర్వచనం: చిరు
X
''శతమానం భవతి సక్సెస్ చూస్తుంటే.. ఒక మంచి వెజిటేరియన్ భోజనం తిన్నట్లుంది. నా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే చాలామంది కోరుకున్నట్లున్నారు. అందుకే ఈ రేంజ్ హిట్టయ్యింది'' అంటూ శతమానం సక్సెస్ గురించి దిల్ రాజును అభినందిస్తూ.. సభను ఆహ్లాదపరిచారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా సక్సెస్ మీట్ కు ఆయన చీఫ్‌ గెస్టుగా విచ్చేసి.. అందరినీ చాలా ఎక్సయిట్ చేశారనే చెప్పాలి.

''ప్రొడ్యూసర్ అంటే తల్లిదండ్రులు లాంటి వారు. కాని ఈరోజున తెలుగు సినిమాల్లో నిర్మాత అంటే ఒక క్యాషియర్ లా ఒక ఫైనాన్షియర్ లా ఉండిపోవడం జరుగుతున్న సత్యం. బాధాకరమైన విషయం. కాని నిర్మాత అనేవాడు.. కథను ఎంచుకున్నపటి నుండి.. సాంకేతిక నిపుణలను ఎంచుకుని వర్క్ రాబట్టడం వరకు.. మామూలు విషయం కాదు. ఈరోజున దిల్ రాజు నిర్మాత అనే పదానికి నిలువెత్తు నిర్వచనం అయిపోయాడంటే గొప్ప విషయం. నా కొడుకు చరణ్‌ సహా చాలామంది హీరోలు అతని సినిమాల్లో చేయాలని అనుకుంటారు. దిల్ అంటే.. కేవలం దిల్ మాత్రమే కాదు.. దమ్ము కూడా ఉంది'' అంటూ దిల్ రాజును ప్రశంసించారు చిరంజీవి. రాజు తన కన్న తల్లిదండ్రులను మాత్రమే కాకుండా.. దర్శకుడు వివి వినయాక్ ను సత్కరించడం.. దిల్ రాజుకే చెల్లింది అంటూ కొనియాడారు. అలాగే అన్నకు ఒక లక్ష్మణుడిలా ఉన్న శిరీష్‌ ను కూడా చిరంజీవి అభినందించారు. దిల్ సినిమాతో వినాయక్ రాజుకు ఇచ్చిన లిఫ్ట్ గురించి ఇప్పటికీ రాజు అలాగే గుర్తుపెట్టుకోవడం అనేది కూడా చాలా పెద్ద 'సెంటిమెంటల్' విషయం అన్నారు చిరంజీవి.

''తన ప్రవర్తనలో కాని.. తన పనితనంలో కాని.. తను డైరక్టర్ గా నడుచుకునే విధానంలో కాని.. దిల్ సినిమా నుండి ఇవాళ్ట వరకు.. ఖైదీ నెం 150 సక్సెస్ వరకు.. ఏమీ మారలేదు. ఒక కొత్త దర్శకుడిలా ఎప్పుడూ హార్డ్ వర్క్ చేశాడు. వినాయక్ పనితనమే ఖైదీ సక్సెస్ కు కారణం'' అంటూ వినాయక్ ను పొగిడేశారు చిరంజీవి. ఇటువంటి మంచి మనిషైన వినాయక్ కు తన చేతిమీద సన్మానం జరగడం అనేది చాలా సంతోషాన్ని కలిగించే విషయమన్నారు.

అలాగే సినిమాలోని నటీనటులైన ప్రకాష్‌ రాజ్ గురంచి వీడు సామాన్యుడు అంటూ అతని నటన తాలూకు స్టామినాపై కామెంట్ చేశారు. నా తమ్ముడు ప్రకాష్ రాజ్ అంటే నాకు గర్వం అంటూ చిరంజీవి చెప్పారు. ఇక జయసుధను సహజ నటి అని.. ఆ పాత్రలోనైనా ధ్రవం మాదిరి అమరిపోతుందని.. ఆమెను పొగిడేశారు. అలాగే నరేష్‌ ఈ మధ్య కాలంలో చాలా మంచి పాత్రలు చేస్తున్నారు.. అదిరిపోతున్నాయ్.. అని అన్నారు చిరంజీవి. ఇక ఇంద్రజ కోసమైనా శతమానం భవతి చూడాల్సిందే అని చెప్పారు.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి చాలా వింటున్నానని అన్నారు చిరంజీవి. ''మీ గురించి చాలా విన్నాను. మంచి పెర్ఫార్మర్ అంటున్నారు. ఫ్యూచర్ లో ఇంకా మంచి సినిమాలు చేయాలి'' అంటూ అనుపమ పై కామెంట్ చేశారు చిరంజీవి. అవును నిజమే.. అనుపమను ఆయన ''మీరు'' అనే సంభోందించారు.

ఇక శర్వానంద్ గురించి మాట్లాడుతూ..

''మా చరణ్‌ కు ఫ్రెండ్. మా ఇంట్లో పెరిగిన అబ్బాయి. కాని ఎప్పుడూ కూడా కామ్ గా ఉండేవాడు. హీరో మెటీరియల్ అనిపించేది కాని.. అతనికి కోరిక ఉందో లేదో అని డౌట్ ఉండేది. కాని తను యాక్టింగ్ చేయాలని అనుకుంటున్నాడని చరణ్‌ చెప్పినప్పుడు.. అప్పుడే ఒక థమ్సప్ యాడ్ చేయాల్సి వస్తే.. అందులో నాతో యాక్ట్ చేసే కుర్రాడి పాత్రకు శర్వానంద్ ను ఎంపిక చేశాం. మీతో కలసి కెమెరా ఫేస్ చేస్తున్నానంటే చేసేస్తా అంకుల్ అంటూ వెంటనే రంగంలోకి దిగాడు. అలా శర్వా డెబ్యూ నాతోనే జరిగింది. నాకు ఆనందంగా ఉంది. నా కొడుకు సక్సెస్ ఎంతో నాకు శర్వానంద్ సక్సెస్ కూడా అంతే'' అంటూ వ్యాఖ్యానించారు చిరంజీవి. ఈ సినిమాలో శర్వా చేసిన హెల్తీ రొమాంటిక్ క్యారక్టర్ యాడ్స్ లో చూస్తుంటే తెగ నచ్చేసింది అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/