Begin typing your search above and press return to search.

లారెన్స్ కి షాకిచ్చిన మెగాస్టార్

By:  Tupaki Desk   |   18 April 2019 4:14 AM GMT
లారెన్స్ కి షాకిచ్చిన మెగాస్టార్
X
మెగాస్టార్ చిరంజీవి- లారెన్స్ మాస్టార్ అనుబంధం గురించి తెలిసిందే. అన్న‌య్య అని పిలిచేంత చ‌నువు లారెన్స్ కి ఉంది. అత‌డిని త‌మ్ముడు అని చిరు సంభోదిస్తారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కొరియోగ్రాఫ‌ర్- హీరో బాండింగ్ కంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉంద‌ని చెబుతారు. స్వ‌యంకృషితో ఎద‌గ‌డంలోనూ.. సామాజిక సేవ‌లోనూ ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య కొన్ని సారూప్య‌త‌లు ఉన్నాయి. అయితే ఇటీవ‌ల లారెన్స్ మాస్టార్ ద‌ర్శ‌క‌హీరోగా.. నిర్మాత‌గా త‌న ప్ర‌యాణం సాగిస్తున్నారు. తాజాగా `కాంచ‌న` సిరీస్ నుంచి తాజా సినిమా `కాంచ‌న 3` రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లాలో జ‌రిగిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో లారెన్స్ పాల్గొన్నారు. ఈ వేడుక‌కు మెగాస్టార్ అటెండ్ కాలేక‌పోయినా త‌న త‌ర‌పున ఒక ఏవీని పంపించారు. దాంతో పాటే హైద‌రాబాద్ లో త్వ‌ర‌లో ప్రారంభం కానున్న లారెన్స్ ట్ర‌స్ట్ కి రూ.10ల‌క్ష‌ల తొలి విరాళాన్ని మెగాస్టార్ పంపించారు. ఆ చెక్ ని గీతా ఆర్ట్స్ అధినేత‌ అల్లు అర‌వింద్ లారెన్స్ కి స్వ‌యంగా అందించారు.

ఆ విజువ‌ల్స్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ లారెన్స్ మాస్టార్ కి ఆశీస్సులు అందించారు. చిరంజీవి మాట్లాడుతూ -``లారెన్స్ రాఘ‌వ రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా తెలుసు. ముఠామేస్త్రి సినిమాలో ఒక సాంగ్ లో గ్రూప్ డ్యాన్స‌ర్స్ లో ఒక మూల ఉండి డ్యాన్స్ చేశాడు. ఆ రోజే అత‌డి ప్ర‌త్యేక‌త‌ను గుర్తించాను. అప్ప‌టి నుంచి త‌న‌ని అబ్జ‌ర్వ్ చేశాను. రెండేళ్ల తర్వాత `ఆంటీ` అనే సినిమాకి తొలిసారి కొరియోగ్ర‌ఫీ చేశాడు. చిన్న సినిమా అయినా ఆ పాట నాకు బాగా గుర్తుండిపోయింది. 1995లో హిట్ల‌ర్ చేసేప్పుడు ఒక సాంగ్ కి అత‌డిని కొరియోగ్ర‌ఫీ చేయ‌మ‌న్నాను. అబీబీ అబీబీ సాంగ్ అది. ఆరోజునుంచి ఇప్ప‌టికీ గుర్తుండిపోయేలా చేశాడు... శభాష్ అనిపించాడు. అప్ప‌టి నుంచి కొరియోగ్రాఫ‌ర్ గా అంచ‌లంచెలుగా ఎదిగేస్తూ నంబ‌ర్ 1 స్థానం సాధించాడు. కొరియోగ్రాఫ‌ర్ గా.. క‌థ‌కుడిగా న‌టుడిగా.. నిర్మాతగా అంచ‌లంచెలుగా ఎదుగుతూ ప్ర‌తి ఒక్క‌రూ వావ్ అనేలా చేశాడు లారెన్స్ మాస్టార్. స్వ‌యంకృషితో ఎదిగాడు లారెన్స్. అలాంటి వాళ్ల‌ను అభిమానిగా త‌మ్ముడిగా ఇష్ట‌ప‌డ‌తాను. కాంచ‌న 3 విడుద‌ల‌కు రెడీ అవుతోంది. గ‌త సినిమాల్లానే విజ‌యం సాధిస్తుంది. ఈ సినిమా అత‌డికి మ‌రో క‌లికితు రాయి అవుతుంది`` అన్నారు.

ఈ సంద‌ర్భంగా లారెన్స్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ బ్రాంచ్ ను హైద‌రాబాద్ లోనూ అత‌డు ప్రారంభిస్తున్నందుకు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు చిరంజీవి. ``చెన్న‌య్ లో 200 మంది పిల్ల‌ల‌కు ఉచిత విద్య అందిస్తున్నాడు లారెన్స్. 150 మంది పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్స్ చేయించి లైఫ్ ని ఇచ్చాడు. 60 మంది పిల్ల‌ల వ‌ర‌కూ పూర్తిగా అడాప్ట్ చేసుకుని బాగోగుల‌కు సాయం చేశాడు. ట్ర‌స్ట్ ద్వారా వ‌చ్చే మొత్తంతో అద్భుత సేవ‌లు అందిస్తున్నాడు. అదే విధంగా హైద‌రాబాద్ లోనూ సేవ‌లు చేసేందుకు ట్ర‌స్ట్ ప్రారంభించే ప్ర‌య‌త్నం చేస్తున్నందుకు ఈ ట్ర‌స్ట్ కు నా వంతు సాయంగా రూ.10ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టిస్తున్నాను. లారెన్స్ త‌న‌కు ఉన్నంత‌లో ప్ర‌జాసేవ‌, క‌ళా సేవ చేయ‌డం.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిల‌వ‌డం చూస్తుంటే శ‌భాష్ అనిపిస్తోంది. లారెన్స్ లాంటి వాళ్లు మ‌రెంద‌రో రావాలి. స్ఫూర్తిగా నిల‌వాలి`` అని అన్నారు చిరు.