Begin typing your search above and press return to search.

వాట్ ఎ డైలాగ్ మెగాస్టార్

By:  Tupaki Desk   |   24 Aug 2015 4:34 AM GMT
వాట్ ఎ డైలాగ్ మెగాస్టార్
X
సుబ్రమణ్యం ఫర్ సేల్ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రసంగించి ఆ ఫంక్షన్ కు కళ తెచ్చాడు. ఆయన ప్రసంగం ఆద్యంతం అభిమానుల్ని ఉర్రూతలూగించేలా సాగింది. సినిమా ఫంక్షన్లకు వచ్చినపుడు తనలో కలిగే ఫీలింగ్స్ గురించి ఆయన చెప్పిన డైలాగ్ ప్రసంగానికి హైలైట్ గా నిలిచింది. ఆయనేమన్నారో చూడండి.

‘‘పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఐదారు రోజులుగా అభిమానుల సమక్షంలోనే గడుపుతున్నా. చూస్తుంటే ఇవి మెగా ఫ్యామిలీ వారోత్సవాల్లాగా అనిపిస్తున్నాయి. ఒక రోజు అభిమానులతో పుట్టిన రోజు జరుపుకున్నా. ఒకరోజు కుటుంబ సభ్యులు, పరిశ్రమకు సంబంధించిన వాళజ్లతో గడిపా. ఇప్పుడు సుబ్రమణ్యం ఫర్ సేల్ యూనిట్ తో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నా. పుట్టిన రోజు సందర్భంగా మీడియా వాళ్లకు ఇంటర్వ్యూలిస్తుంటే.. అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. గత ఎనిమిదేళ్లలో సినిమాలకు దూరమయ్యానని భావిస్తున్నారా అని. కానీ నేను నటించకపోవచ్చు. కానీ సినీ పరిశ్రమతో నిరంతరం కనెక్టయ్యే ఉన్నా. సినిమాల్ని మిస్సవడమంటూ ఉండదు.

ఇలాంటి వేడుకలకు వచ్చినపుడు.. అభిమానులతో గడిపినపుడు.. ఈ కేరింతలు విన్నపుడు.. ‘ఇది కదా మన ఏరియా.. ఇది కదా మన ఎరీనా.. ఇది కదా మన సామ్రాజ్యం... ఇది కదా మన స్వస్థలం’ అనిపిస్తుంది. చాలా ఉద్వేగానికి లోనవుతుంటాను. సాయిధరమ్ అన్నాడు.. అలసిపోయాను కదా, ఫంక్షన్ కు పిలుద్దామా వద్దా అనుకున్నానని. కానీ నన్ను పిలవకపోయుంటే చాలా బాధపడేవాణ్నేమో. రాకపోయి ఉంటే నా ఆప్తమిత్రులైన అభిమానుల్ని మిస్సవుతాను. అభిమానులే నాకు ఇంధనం, వాళ్లే నాకు స్ఫూర్తి. వాళ్ల కోసమే ఇలాంటి ఫంక్షన్లకు వస్తుంటా. ఎనర్జీ తెచ్చుకుంటా’’ అని మెగా స్టార్ అన్నాడు.